ఒకప్పుడు నరేంద్ర మోడీ అమెరికాలో అడుగు పెట్టేందుకు వీసా ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు అదే అమెరికన్ ప్రభుత్వం అమెరికన్ కాంగ్రెస్ సభ్యులని ఉద్దేశ్యించి ప్రసంగించమని ఎర్ర తివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తోంది. ఆయన మాట్లాడుతుంటే కాంగ్రెస్ సభ్యులు అందరూ నాగస్వరం వింటున్న నాగుపాములులాగ మైమరచి తలలూపుతూ వింటారు. లేచి నిలబడి చేతులు నొప్పెట్టేవరకు చప్పట్లు కొడుతారు. ఇప్పుడు ఆయన ఏది అడిగితే అది ఇవ్వడానికి అమెరికా ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ క్రెడిట్ కేవలం ప్రధాని నరేంద్ర మోడీకే స్వంతమని చెప్పక తప్పదు. దానిలో మరెవరికీ వాటా పంచి ఇవ్వనవసరం లేదు. గత యూపియే హయంలో భారత్ పట్ల అమెరికా వ్యవహరించిన తీరుకి, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకి ఎక్కడా పోలికే లేదు.
కేవలం రెండేళ్ళలో మూడు పర్యటనలతోనే అమెరికాని హిప్నటైజ్ చేసినట్లుగా మోడీ పూర్తిగా వశపరుచుకొన్నారు. తత్ఫలితంగా పాకిస్తాన్ కి ఎఫ్-16 యుద్ద విమానాల అమ్మకం చివరి నిమిషంలో నిలిచిపోయింది. అణు సరఫరా దేశాల గ్రూప్ లో సభ్య దేశంగా చేరేందుకు భారత్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. దానికి అమెరికా లైన్ క్లియర్ చేసింది. భారత్ ని కీలక రక్షణ భాగస్వామిగా ప్రకటించింది. తాజాగా గగనతల గస్తీ కోసం మూడు మానవరహిత డ్రోన్ విమానాలు కావాలని మోడీ కోరగానే దానికీ ఒబామా ఓకే చెప్పేశారు. ఊహించని ఈ పరిణామాలని చూసి ప్రపంచ దేశాలు చాలా ఆశ్చర్యపోతున్నాయి. చైనా, పాకిస్తాన్ దేశాలయితే ఈ పరిణామాలను జీర్ణించుకోలేక భారత్ పై విషం కక్కుతున్నాయి.
అయితే ఇవన్నీ ఏకపక్షంగా జరుగలేదని చెప్పవచ్చు. పఠాన్ కోట్ దాడి గురించి పాకిస్తాన్ పై భారత్ ఒత్తిడి చేయడం మానేసింది. పాకిస్తాన్ తో మళ్ళీ సంబంధాలు కలుపుకొనే ప్రయత్నాలు చేయకపోయినా, దానిపై విమర్శలు చేయకుండా మౌనం వహించి దానిపై ఒత్తిడి తగ్గించారు. అమెరికా అవసరాలని గుర్తించి తదనుగుణంగా భారత్ లో సంస్కరణలు చేపట్టారు. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ప్లేస్ గా చెప్పుకోదగ్గ భారత్ ద్వారాలు అమెరికా కోసం బార్లా తెరిచారు. రక్షణ, వైమానిక రంగాలలో 100 శాతం, ఫార్మా రంగంలో 74 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకి మార్గం సుగమం చేశారు. దాని వలన ఎక్కువ ప్రయోజనం పొందే దేశం అమెరికాయేనని అందరికీ తెలుసు.
బరాక్ ఒబామా పదవీ కాలం ముగిసేలోగా మోడీ ప్రభుత్వం అమెరికాకి లబ్ది కలిగించే ఇటువంటి నిర్ణయాలు ఇంకా చాలానే తీసుకోవచ్చు. కనుక అమెరికా కూడా భారత్ పట్ల అంతే సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఒకవేళ డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైతే ఆయనని కూడా మోడీ ఇదే విధంగా మెప్పించి పనులు చక్కబెట్టుకోగలిగితే, ఈ రెండేళ్లలో సాధించిన వాటికంటే అదే గొప్ప విషయం అవుతుంది.