ఆస్ట్రేలియా పిచ్‌లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వింగ్‌కు స్వర్గధామం. పేసర్లు ఇలాంటి పిచ్‌లపై పండగ చేసుకొంటారు. చలికాలంలో కూడా బ్యాటర్లకు సెగలు పుట్టిస్తారు. అచ్చంగా అదే జరుగుతోంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో మొదలైన తొలి టెస్ట్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 150 పరుగులకే కుప్పకూలిపోయింది. అనంతరం ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 83 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆ మూడు వికెట్లను త్వరగా చేజిక్కించుకొంటే భారత్ కు మంచి ఆధిక్యం దక్కొచ్చు.
తొలుత భారత బ్యాటింగ్ చాలా పేలవంగా ప్రారంభమైంది. పరుగులు సాధించడానికి చమటోడాల్చి వచ్చింది తొలి టెస్ట్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి (41) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయ్యారు. కోహ్లీ (5) మరోసారి నిరాశ పరిచాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ ఎడిల్ వుడ్ 4 వికెట్లు తీశాడు. భారత బౌలర్లలో బుమ్రా చెలరేగిపోయాడు. నాలుగు వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. సిరాజ్ కూడా రెండు వికెట్లతో రాణించాడు. ప్రస్తుతం అలెక్స్ కెరీ (19) మిచెల్ స్టార్క్ (6) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బౌలర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్‌లో 200 పరుగులు చేయడం కూడా కష్టంగా మారుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో కనీసం 50 పరుగుల ఆధిక్యం సంపాదిస్తే ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. చివరి బ్యాటర్లు కూడా పరుగులు సాధించే సత్తా ఉన్నవాళ్లే. ఆధిక్యం తగ్గకుండా చూసుకొని, రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ చేస్తేనే ఈ మ్యాచ్ మనదవుతుంది.