తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ని 112 పరుగులకు ఆలౌట్ చేసిన ఆనందం భారత్ కి ఎంతోసేపు దక్కలేదు. ప్రత్యర్థి బాటలోనే నడిచి కేవలం 145 పరుగులకే భారత్ కూడా ఆలౌట్ అయ్యింది. అయితే.. తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించగలిగింది.
ఈరోజు 3 వికెట్ల నష్టానికి 99 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ త్వర త్వరగా వికెట్లను కోల్పోయింది. తొలుత అజింక్యా రెహానే (7) వెనుదిరిగాడు. ఆ తరవాత… రోహిత్ శర్మ (66) వంతు వచ్చింది. పంత్ (1), వాషింగ్టన్ సుందర్ (0), అక్షర్ పటేల్ (0) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్ (17) ఒక్కడే కాసేపు భారత పతనాన్ని నిలువరించగలిగాడు. బుమ్రాని రూట్ అవుట్ చేయడంతో.. భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ రీచ్‌కి నాలుగు వికెట్లు దక్కాయి, పార్ట్ టైమ్ బౌలర్ రూట్ 5 వికెట్లు దక్కించుకోవడం గమనార్హం. పిచ్ పరిస్థితి చూస్తుంటే….. ఇక మీదట స్పిన్నర్లకు మరింత గా సహకరించే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడం ఖాయం అనిపిస్తోంది. భారత్ ముందు ఇంగ్లండ్ ఎంత విజయలక్ష్యాన్ని నిర్దేశిస్తుందన్నది ఇప్పుడు కీలకం. లక్ష్యం 180 పరుగులు దాటిందంటే.. ఛేదించడం కష్టమే.