పార్ట్ టైమ్ బౌలర్లు.. ఈ మాట క్రికెట్ లో తరచూ వింటుంటాం. నికార్సయిన బౌలర్లు.. అప్పుడప్పుడూ పార్ట్ టైమ్ బౌలర్లుగా అవతారం ఎత్తుతుంటారు. సచిన్ కూడా అలా పార్ట్ టైమ్ బౌలర్ గా అద్భుతాలు సృష్టించిన వాడే! అయితే భారత జట్టులో ఇప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లకు కొరత వచ్చింది. బుమ్రా, షమీ, సిరాజ్, జడేజా, కులదీప్ రూపంలో మన జట్టుకు ఐదురుగు రెగ్యులర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. వీళ్లంతా బంతితో రాణిస్తున్నారు. అయితే వీళ్లలో ఎవరైనా లయ తప్పి, ధారాళంగా పరుగులిస్తే… వాళ్ల కోటా భర్తీ చేయడానికి ఒకరిద్దరు పార్ట్ టైమ్ బౌలర్ల అవసరం ఉంది. అదృష్టవశాత్తూ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఆ అవసరం రాలేదు. అయితే రాబోయేవి నాకౌట్ మ్యాచ్లు. అందుకే ఇప్పటికే సెమీస్ లో చోటు దక్కించుకొన్న భారతజట్టు… నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేసింది. కోహ్లీ, గిల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలను బౌలింగ్ కి దింపింది. వీళ్లంతా బౌలింగ్ వేసి అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు.
కోహ్లీకి ఇది వరకు బౌలింగ్ వేసిన అనుభవం ఉంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఓ వికెట్ కూడా తీశాడు. వరల్డ్ కప్ మ్యాచ్లో కోహ్లీకి వికెట్ దక్కడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ కూడా ఇది వరకు రెగ్యులర్ గా బౌలింగ్ వేసేవాడు. సుదీర్ఘ విరామం తరవాత బౌలింగ్ కి దిగిన రోహిత్ ఖాతాలో కూడా ఓ వికెట్ పడింది. గిల్, సూర్య కుమార్ యాదవ్ లు బౌలింగ్ వేయగా చూడడం ఇదే తొలిసారి. రాహుల్, శ్రేయాస్లతో కూడా బౌలింగ్ చేయించలేకపోయావా.. అంటూ రోహిత్ శర్మని అభిమానులు సరదాగా ఆటపట్టిస్తున్నారు. సెమీస్ కు ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమే. ఎందుకంటే రానున్న మ్యాచ్లలో పార్ట్ టైమ్ బౌలర్ అవసరం భారత్కు రావొచ్చు. ఆస్ట్రేలియా జట్టులో మాక్స్వెల్ రూపంలో మంచి పార్ట్ టైమ్ బౌలర్ అందుబాటులో ఉన్నాడు. సెమీస్ చేరిన సౌత్ ఆఫ్రికా జట్టులో మార్కమ్ అప్పుడప్పుడూ బౌలింగ్ లో మెరుస్తాడు. న్యూజిలాండ్ జట్టులో ఫిలిప్స్ కూడా బంతిని తిప్పగలడు. సెమీస్ చేరిన అన్ని జట్లలోనూ రెగ్యులర్ పార్ట్ టైమ్ బౌలర్లు ఉన్నారు. మనకే లేరు. అందుకే రోహిత్ ఈ ప్రయోగం చేసి ఉంటాడు.