న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ టీమ్ఇండియా చేతులు ఎత్తేసింది. సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ని చేజేతుల పాడుచేసుకుంది.147 పరుగుల లక్ష్య చేరుకోలేకపోయింది. 121 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పటికే ఈ సిరిస్ లో రెండు మ్యాచులు ఓడిపోయిన టీమ్ఇండియా ఈ మ్యాచ్ ఓటమితో వైట్‌వాష్ అయ్యింది. టీమ్ఇండియా సొంత గడ్డపై వైట్‌వాష్ కావడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్ లో అజాజ్ పటేల్ (6/57), గ్లెన్ ఫిలిప్స్ (3/42), మాట్ హెన్రీ (1/10)వికెట్లతో చెలరేగారు. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (64) మినహా ఎవరూ రాణించలేదు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు భారత్ కు సన్నగిల్లాయి. అదలావుంచితే.. టీమ్ఇండియా ఆటతీరులో డొల్లతనం ఈ సిరిస్ లో స్పష్టంగా కనిపించింది. భారత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్పిన్‌కు బాగా ఆడుతారనే పేరున్న మన బ్యాటర్లు కివీస్ స్పిన్ కి విలవిల్లాడిపోయారు.
టెస్ట్ జట్టు కూర్పు విషయంలో ఈ ఓటమి టీమ్ఇండియా పెద్ద గుణపాఠం. అజింక్య రహానే, పూజరా లాంటి క్లాసిక్ ప్లేయర్స్ ని బోర్డ్ పక్కన పెట్టడంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రోహిత్ సేన 46 పరుగులకే ఆలౌట్ అవ్వడం చరిత్రలో మాయని మచ్చ. పిచ్ ని సరిగ్గా స్టడీ చేయలేని కెప్టన్ రోహిత్, కోచ్ గంబీర్ ఈ ఓటమికి పూర్తి బాధ్యత. మిగిలిన రెండు టెస్టుల్లో భారత్ తన బలం స్పిన్ అని బరిలోకి దిగింది. ఈ బలం కాస్త బలహీనత అయ్యింది. స్పిన్ ని ఏమాత్రం ఎదుర్కోలేక చతికలపడ్డారు.
ఈ ఓటమిని ప్రపంచ క్రికెట్ నిశితంగా పరిశీలించింది. పలువురు మాజీ క్రికెటర్లు.. భారత్ బ్యాటర్లు స్పిన్ కి బాగా ఆడగలుగుతారనేది ఓ బ్రమ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి దారుణమైన పరాజయాలు వచ్చినప్పుడు ఏ జట్టు అయినా విమర్శలు ఎదుర్కొవలసిందే. మొత్తానికి తమ బలం, బలహీనతలు తెలుసుకోవడానికి ఈ ఓటమి టీమ్ఇండియాకి ఓ పెద్ద గుణపాఠం.