టీమ్ ఇండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో.. పటిష్టమైన న్యూజీలాండ్‌ని ఓడించి గత ప్రపంచకప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకొంది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో భారత్ నెంబర్ వన్! ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి మేటి జట్లని ఓడించిన భారత్.. ప్రపంచకప్ రేసులో హాట్ ఫేవరెట్ గా మారింది. ఆస్ట్రేలియాతో తొలి పోరులో ఆరంభంలో కాస్త తడబడిన భారత్.. ఆ తరవాత వరుసగా వన్ సైడ్ వార్లు చేసుకొంటూ వెళ్తోంది. న్యూజీలాండ్ తో గెలుపు తరవాత.. సెమీస్ స్థానం దాదాపుగా భారత్ ఖాయం చేసుకొన్నట్టే. రాబోయే మ్యాచ్‌లలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో తలపడుతుంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా.. సెమీస్ బెర్తు ఖాయమైనట్టే.
ప్రస్తుతం ఉన్న ఫామ్ నిచూస్తే భారత్ ఏ జట్టునైనా ఓడించగలదు అనే నమ్మకం ఏర్పడింది. భారత్ రిజర్వ్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. శార్దూల్ స్థానంలో బరిలోకి దిగిన షమీ.. న్యూజీలాండ్ పై 5 వికెట్లు తీసుకొని తన సత్తా చూపించాడు. అశ్విన్, ఇషాన్ ఇషాన్ రూపంలో బెంచ్ పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్, గిల్ నిలకడైన ఆరంభాన్ని అందిస్తున్నారు. కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రాహుల్ కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నాడు. బౌలింగ్ లో బుమ్రా తన పదును చూపిస్తున్నాడు స్పిన్నర్లు సరే సరి. భారత్ జట్టులో ఉన్న సమతూకం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి ఛాంపియన్ జట్టలో కూడా కనిపించడం లేదు. ఇంగ్లండ్ ఆట తీరైతే.. మరీ ఘోరంగా తయారవుతోంది. మిగిలిన అన్ని జట్లూ ఏదో ఓ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్ మాత్రం అలా కాదు. సొంత గడ్డపై ఆడుతుండడం, ఇక్కడి మైదానాలపై,పిచ్‌లు ప్రవర్తించే విధానంపై భారత్‌కు అవగాహన మెండుగా ఉండడం కలిసొచ్చే విషయం. సెమీస్‌లో ఏ జట్టు ఎదురైనా భారత్ కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇదే ఫామ్ కొనసాగితే.. ముచ్చటగా మూడో టైటిల్ మన సొంతం అవుతుంది.