న్యూజిలాండ్‌కు అదృష్టం కలసి రావడం లేదు. గెలుపు ముంగిటకు వెళ్లి బొక్కా బోర్లా పడే జాతకం ఇంకా అలాగే ఉంది. వెల్లింగ్టన్లో జరిగిన నాలుగో టీ ట్వంటీలో.. సూపర్ ఓవర్ పరాజయం చవి చూసింది. సూపర్ఓవర్లో 13 పరుగులు కివీస్ స్టార్ బ్యాట్స్మెన్లుచేయగా.. దాన్ని టీమిండియా ఓపెనర్లు అలవోగా చేధించారు. మ్యాచ్ మొత్తం మీద టీమిండియా .. కివీస్ ఇన్నింగ్స్ చివరి ఓవర్, సూపర్ ఓవర్లో మాత్రమే పైచేయి సాధించింది.
మిగతా అంతా.. టీమిండియాపై బ్లాక్ క్యాప్స్ .. పైచేయి సాధిస్తూనే ఉన్నారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో.. లైన్ గతి తప్పింది. మనీష్ పాండే ఒక్కడే యాభై పరుగులు చేశారు. తర్వాత లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్.. ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. 19 ఓవర్ ముగిసే సరికి.. మూడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉండగా.. ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ కివీస్ ఆటగాళ్లు అక్కడే బోల్తా పడ్డారు. కేవలం ఆరుపరుగులే చేశారు.
నాలుగు వికెట్లు కోల్పోయారు. శార్దూల్ ఠాకూర్ కివీస్ ఆటగాళ్ల కంగారును పక్కాగా వాడుకున్నాడు. దాంతో మ్యాచ్ టై అయింది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఆక్కడ మిగతా పనిని టీమిండియా ఆటగాళ్లు పూర్తి చేశారు. మూడో టీ ట్వంటీ కూడా సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్లో ఓడిన కివీస్ కు.. సూపర్ ఓవర్ ఫోబియా పట్టుకున్నట్లయింది.