టెస్టు సిరీస్, టీ20లో ప్రతాపం చూపించిన టీమ్ ఇండియా.. వన్డేల్లోనూ అదరగొట్టింది. ఏ ఫార్మెట్ లో అయినా తమకు తిరుగులేదని చాటి చెప్పింది. పూణేలో ఈరోజు జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డేలో విజయకేతనం ఎగరేసి వన్డే సిరీస్ ని 2-1తో కైవసం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన 329 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం భారీ టార్గెట్ ఛేదించడానికి బరిలో దిగిన ఇంగ్లండ్ 322 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. శామ్ కరణ్ 95 పరుగులతో ఒంటరి పోరు చేసినా.. జట్టుని గెలిపించలేకపోయాడు. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావల్సివుండగా… నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారత్ గెలుపు ఖాయమైంది.
అంతకు ముందు… పంత్ (62 బంతుల్లో 78) మరోసారి చెలరేగిపోయాడు. తనకు హార్దిక్ పాండ్యా (64), శేఖర్ దావన్ (67) చేయూత నివ్వడంతో.. భారత్ మంచి స్కోరు సాధించింది. చివర్లో శార్దూల్ (21 బంతుల్లో 30) కొన్ని మెరుపులు మెరిపించాడు. ఛేదనలో ఇంగ్లండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఇంగ్లండ్ కి పరుగులు తీయడం గగనమైంది. ఓ దశలో భారత్ సునాయాసంగా గెలుస్తుందనుకున్నారంతా. అయితే.. శామ్ కరణ్.. అడ్డుపడిపోయాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో దాదాపుగా ఒంటిచేత్తో గెలిపించేంత వరకూ వెళ్లాడు. భారత ఫీల్డింగ్ మరీ నాశికరంగా తయారై… నాలుగు క్యాచ్‌లను జారవిడిచారు. దాంతో ఓ దశలో ఇంగ్లండ్ గెలుస్తుందనుకున్నారంతా. చివర్లో భారత్ మళ్లీ పుంజుకుంది. శార్దూల్ 67 పరుగులకు 4 కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. భువికి 3 వికెట్లు దక్కాయి. మూడు సిరీస్‌లలో ఒక్కటి కూడా గెలవకుండానే ఇంగ్లండ్ ఉత్త చేతులతో స్వదేశానికి పయనమైంది.