వరల్డ్ కప్ కి ముందు టీమీడియా శిభిరంలో ఆసియా కప్ టైటిల్ చేరింది. కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు. ఇదే క్రమంలో వన్డేల్లో తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27 , ఇషాన్ కిషన్ (23) వికెట్ కోల్పోకుండా భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఇండియా ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదో సారి.
ఈ మ్యాచ్ తో మిండియా పేరుతో వున్న ఓ చెత్త రికార్డ్ కూడా మాయమైపోయింది. గతంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే భారత్ 54 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వన్డేలో ఇదే అతి తక్కువ స్కోర్. ఇప్పుడా రికార్డును 50 పరుగులతో శ్రీలంకనే తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచ కప్ గెలవడానికి సిద్ధమౌతున్న టీమిండియా ఆసియా కప్ విజయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. స్టార్ ఆటగాళ్ళని పక్కనపెట్టి దిగిన నామమాత్రపు మ్యాచ్ లో బంగ్లాదేశ్ లో ఓటమి పాలైనప్పటికీ ఫైనల్ లో భారీ విజయం ఇండియా బలాన్ని మరోసారి చాటింది.