ఆసియా కప్‌లో భారత్ ఒక ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్‌లో చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో భారత్ విజయం సాధించడం విశేషం. ఒక దశలో భారత ఆటగాళ్లు.. క్రీడాభిమానుల్ని టెన్షన్ పెట్టినప్పటికీ… చివరికి ఇంకా నాలుగున్నర ఓవర్లు మిగిలి ఉండగానే… లక్ష్యాన్ని ఛేదించి హమ్మయ్య అనిపించారు. అయిదు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్ మిర్పూర్లో శనివారం చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్తాన్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు దించింది. తొలిఓవర్లోనే వికెట్ తీసుకోవడం ద్వారా నెహ్రా భారత క్రీడాభిమానుల్లో ఉత్సాహం నింపాడు. కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌లతో రాణించిన భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌ను తక్కువ పరుగు వద్దనే కట్టడి చేయగలిగారు. మొత్తానికి పాకిస్తాన్ 17.3 ఓవర్లపాటు ఎదురీది 83 పరుగుల వద్ద చతికిల పడింది. ప్రపంచదేశాలన్నిటితోను టీ20 మ్యాచుల్లో పాకిస్తాన్ చేసిన మూడో అత్యల్ప స్కోరు ఇది. భారత్ గతంలో 2012లో పాక్‌ను 123 పరుగుల అత్యల్పస్కోరు వద్ద కట్టడిచేసింది. దాని తర్వాత ఇంత తక్కువ స్కోరుకు అవుట్ చేయడం ఇదే. ఈ వికెట్లు సాధించడంలో బౌలర్ల ప్రతిభతోపాటు, కోహ్లి విసిరిన ఓ అద్భుతమైన త్రో రనవుట్ వంటివి కూడా ఉన్నాయి.
పాకిస్తాన్‌ను అత్యల్ప స్కోరుకు అవుట్ చేసినప్పటికీ.. భారత్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. తొలి ఓవర్‌నుంచి చుక్కలు కనిపించాయి. ప్రత్యకించి పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. దారుణం ఏంటంటే తొలి ఓవర్లోనే భారత్ రోహిత్ శర్మ, ఆజింక్య రహానేల వికెట్లను కోల్పోయింది. మూడో ఓవర్ల రైనా వికెట్ పడిపోయింది. ఆ తర్వాత.. చాలాసేపు టెస్ట్ మ్యాచ్ తరహాలో.. చాలా నిదానంగా యువరాజ్‌సింగ్, కోహ్లి ఆడుకుంటూ వచ్చారు. లక్ష్యం చిన్నదే గనుక.. క్రీడాభిమానులు ఎదురుచూస్తూ కూర్చున్నారు. మధ్యమధ్యలో అవకాశం దొరికినప్పుడెల్లా.. కోహ్లి ఫోర్లు కొట్టేస్తూ.. లక్ష్యానికి ఉన్న దూరాన్ని తగ్గిస్తూ.. జట్టుపై ఒత్తిడిని తుడిచిపెట్టేశాడు. అయితే విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో కోహ్లి అవుట్ కావడం, ఆ తర్వాత వచ్చిన పాండ్య 0 పరుగులకే వెనుదిరగడం మళ్లీ టెన్షన్ పెంచాయి. కానీ ధోనీ బరిలోకి వచ్చిన తర్వాత.. కొన్ని బంతుల్లోనే భారత్ విజయం తేలిపోయింది. క్రీడాభిమానుల పండుగ వాతావరణం మధ్య భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సొంతంచేసుకుంది.