INDIAN 2 movie review
తెలుగు360 రేటింగ్: 1.5/5
సౌత్ ఇండియన్ సినిమా స్టామినాని దేశం మొత్తానికి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. ఇప్పుడంటే అంతా… రాజమౌళి జపం చేస్తున్నారు కానీ, ఒకప్పుడు శంకర్ అందుకు ఏమాత్రం తీసిపోడు. జీన్స్, ప్రేమికుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు… వరుస హిట్లే. అసలు ఈ మనిషి ఫ్లాపన్నదే తీయడా? అనేంత ఆశ్చర్యం కలిగించాడు శంకర్. సామాజిక అంశానికి కమర్షియాలిటీ అద్దడంలో శంకర్‌కు తిరుగులేదు. విజువల్ గ్రాండియర్ అంటే ఎలా ఉంటుందో ఓతరం శంకర్‌ను చూసి నేర్చుకొంది. అలాంటి శంకర్.. చాలా కాలంగా స్థబ్దుగా ఉన్నాడు. ఆయన్నుంచి, ఆయన క్యాలిబర్‌కి తగిన సినిమా రాలేదన్నది అందరి కంప్లైంట్. ఈ విషయం శంకర్‌కూ తెలుసు. అందుకే తన బలాబలాలపై దృష్టి పెట్టాడు. ఒకప్పుడు తాను సృష్టించిన గొప్ప పాత్ర ‘భారతీయుడు’నే మళ్లీ నమ్ముకొన్నాడు. ఆ కథకు సీక్వెల్ అంటూ సేనాపతిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే.. ‘భారతీయుడు 2’. కాంబినేషన్ పరంగా క్రేజ్ తెచ్చుకొన్న ఈ సినిమా ఎలా వుంది? శంకర్ తన మ్యాజిక్ మళ్లీ చూపించాడా? కమల్ తన విశ్వరూపం ప్రదర్శించాడా?
చిత్ర (సిద్దార్థ్) ఓ యూ ట్యూబర్. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అవినీతినీ ప్రశ్నిస్తుంటాడు. స్నేహితులతో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు. లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ అవినీతి తగ్గదు. అన్యాయాలు ఆగవు. తన పోరాటం ఏమాత్రం సరిపోదని భావిస్తాడు. ఒకప్పుడు లంచగొండుల గుండెల్లో దడ పుట్టించిన ‘భారతీయుడు’ రావాలని ఆశిస్తాడు. అందుకే ‘కమ్ బ్యాక్ ఇండియన్’ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలెడతాడు. దేశంలోని ప్రజల బాధల్ని, క్షోభనీ సోషల్ మీడియా ద్వారా సేనాపతి (కమల్ హాసన్)కు చేరవేస్తాడు. ఇవన్నీ చూసిన సేనాపతి మళ్లీ రంగంలోకి దిగుతాడు. మరి… ఈసారి కూడా దేశంలో ఉన్న కుళ్లుని కడిగేశాడా? మార్పుని తీసుకొచ్చాడా? ఈసారి సేనాపతికి ఎదురైన అవరోధాలేంటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాలి.
భారతీయుడు వచ్చి 28 ఏళ్లయ్యింది. అంటే ఓతరం మారిపోయింది. భారతీయుడు ఓ తరానికి అద్భుతం. సేనాపతిగా కమల్ విశ్వరూపం, ఆ విగ్రహం.. మర్మ విద్యల్ని ప్రయోగించిన తీరు, రెహమాన్ సంగీతం, మనీషా కోయిరాలా అందాలు, ఎమోషన్, ఊర్మిళ అల్లరి.. ఒక్కటేంటి? ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతంగా ఉంటుంది. అవినీతిపై పోరాటం అనేది పక్కన పెడితే, కథలో ఓ ఆర్క్ ఉంటుంది. ఎమోషన్ కనిపిస్తుంది. ఓ ప్రారంభం, ముగింపు.. కనిపిస్తాయి. అయితే విచిత్రంగా ఈ రెండో భారతీయుడులో అవేం ఉండవు. కేవలం అవినీతిపై సేనాపతి చేసిన పోరాటం కనిపిస్తుంది. అది కూడా.. వాళ్లని తన మర్మ కళ ద్వారా చంపడమే. తెరపై చాలా విషయాలు జరుగుతున్నా అవి కళ్లకూ, చెవులకూ మాత్రమే చేరువ అవుతాయి. మనసులోకి ఎక్కవు.
`భారతీయుడు` సమయానికి అదో కొత్త సబ్జెక్ట్. దేశంలో ఇంత అవినీతి జరుగుతోందా? అనే బాధ, కోపం ఆతరానికి ఎక్కువగా ఉండేవి. మనలోంచి ఓ హీరో పుట్టి, అవినీతిని అంతం చేయడంతో ప్రేక్షకులకు ఒకరకమైన సంతృప్తి. అయితే `భారతీయుడు` తరవాత అలాంటి కథలే యేడాదికి పదొచ్చేశాయి. ప్రతీ పెద్ద హీరో దాదాపుగా ఈ పాయింట్ టచ్ చేసేశాడు. దాంతో పాటు అవినీతి, లంచం అనేవి పాత పదాలు అయిపోయాయి. అవన్నీ సర్వ సాధారణ వ్యవహారాలుగా మీడియా ట్రీట్ చేయడం మొదలెట్టింది. వాటికి మనసు స్పందించక మొద్దుబారిపోయింది. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత కథనే చెప్పాలనుకోవడం శంకర్ చేసిన దుస్సాహసం. సినిమా మొదలైన అరగంట వరకూ కమల్ పాత్ర కనిపించదు. `సేనాపతి వస్తే కానీ, ఈ దురాచకాలు ఆగవు` అనే ఎమోషన్ పాత్రల్లో కనిపిస్తుంది కానీ, ప్రేక్షకుల్లో కాదు. అందుకే సేనాపతి ఎంటర్ అయినా థియేటర్లో ప్రేక్షకులకు అంత కిక్ రాదు.
భారతీయుడులో సేనాపతి పాత్ర చాలా హుందాగా ఉంటుంది. గంభీరంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ రెండూ లేవు. రకరకాల గెటప్పుల్లో సేనాపతిని చూపించడంతో ఆ పాత భారతీయుడి గాంభీర్యం ఈ భారతీయుడులో మచ్చుకైనా కనిపించకుండా పోయాయి. భారతీయుడు వచ్చి, అవినీతిపరుల్ని చంపడం, అక్కడ ఓ స్పీచ్ దంచి కొట్టడం తప్ప.. ఆ పాత్రలో ఎమోషనల్ డ్రైవ్ లేకుండా పోయింది. ముందు ఇంట్లో ఉన్న కలుపుని తీసేయండి, దేశం దానంతట అదే బాగుపడుతుంది అని ఈ కథతో చెప్పారు. అయితే ‘భారతీయుడు’ లో జరిగింది కూడా అదే. అక్కడ కూడా తన కొడుకుని తన చేతులతో చంపుకొంటాడు సేనాపతి. అక్కడ చెప్పిందే ఇక్కడ చెబుతానంటే ఎలా? చివర్లో ‘గో బ్యాక్ ఇండియన్’ అంటూ సేనాపతిని తరిమికొడతారు ప్రజలు. ఇది కూడా కావాలని వేసుకొన్న కాన్‌ఫ్లిక్ట్ లా అనిపిస్తుంది. సేనాపతి లైవ్ లో మరీ మర్డర్లు చేస్తుంటే – సీబీఐ మొత్తం గుడ్లప్పగించి చూస్తుంటుంది. సేనాపతి అప్ డేట్ అయ్యాడు కానీ, సీబీఐ అవ్వలేదేంటి? అనే డౌటు వస్తుంది. మర్మ కళని శంకర్ ఇష్టమొచ్చినట్టు వాడడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
శంకర్ సినిమా అంటే విజువల్ గ్రాండియర్ ఒక్కటే అనుకొంటే పొరపాటు. తన కథలో ఎమోషన్ బాగుంటుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పకడ్బందీగా రాసుకొంటాడు. `భారతీయుడు 2` దానికి కూడా నోచుకోలేదు. నిజానికి ‘భారతీయుడు 3’ ఎలా ఉండబోతోందో చివర్లో చిన్న గ్లింప్స్ ద్వారా చూపించారు. అది చూస్తే ఈ కథని రెండు భాగాలుగా విడగొట్టి శంకర్ తప్పు చేశాడా? అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 3 గ్లింప్స్ చూస్తే మేటరంతా అందులోనే ఉందనిపిస్తుంది. ఈ రెండు భాగాల కథని షార్ప్‌గా ఒక్కసినిమాలానే చెబితే బాగుండేదేమో? ఇప్పుడు పార్ట్ 3 వచ్చినా… అది కాస్తో కూస్తో బాగానే ఉన్నా, ప్రేక్షకులకు చూడాలన్నంత ఇంట్రస్ట్ రావడం అనుమానమే.
కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరీ అంత ఎక్కువగా లేదు. అలాగని తక్కువగానూ అనిపించదు. ఎందుకంటే కమల్ వచ్చి తెరపై చేసేదేం ఉండదు. రకరకాల గెటప్పుల్లో వచ్చి అవినీతిపరుల్ని అంతం చేయడం తప్ప. తనకు ఇలా మేకప్పు వేసుకోవడం, కొత్త గెటప్పుల్లో అలరించడం కొత్త కాదు. చూడడం ప్రేక్షకులకూ కొత్త కాదు. పార్ట్ 3 గ్లింప్స్ లో యంగ్ లుక్ లో కమల్ దర్శనమివ్వబోతున్నాడు. ఆ గెటప్ రివీల్ చేశారు కూడా. అది బాగుంది. కమల్ డబ్బింగ్ కూడా వెరైటీగా ఉంది. కొన్ని సన్నివేశాలను కమల్ చెప్పినట్టు, ఇంకొన్ని సన్నివేశాలకు మరొకరితో చెప్పించినట్టు అనిపించింది. శంకర్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కాదు.సిద్దార్థ్ కి ఫుల్ లెంగ్త్ పాత్ర దొరికింది. కమల్ హాసన్ ముందు కమల్ హాసన్ కంటే గొప్పగా నటించాలని తాపత్రయపడి భంగపడ్డాడేమో అనిపిస్తుంది. సూర్య ఇలా కనిపించి అలా మాయమయ్యాడు. తన పాత్రకు అసలు ప్రాధాన్యతే లేదు. ఇందులో బ్రహ్మానందం ఉన్నాడా, లేడా? అని ఫజిల్ పెడితే ప్రేక్షకులు సైతం తికమకపడతారు. రకుల్ పాత్ర తక్కువ సపోర్టింగ్ రోల్ కి ఎక్కువ అన్నట్టు తయారైంది. బాబీ సింహా హీరోని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అయ్యే రెగ్యులర్ క్యారెక్టర్.
టెలిఫోన్ ద్వనిలా నవ్వేదానా, పచ్చని చిలకలు తోడుంటే – ఎప్పుడో 28 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు. ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఆ మ్యాజిక్ `భారతీయుడు 2` నుంచి కూడా ఆశిస్తే భంగపాటే. అనిరుధ్ ట్యూన్స్ పై అస్సలు దృష్టి పెట్టలేదు. శంకర్ కూడా పాటలకు స్కోప్ ఇవ్వలేదు. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో సెట్లు నింపేసిన శంకర్… దాన్నే విజువల్ సెన్స్ అనుకొని పొరపడ్డాడు. ఖర్చు విపరీతంగా పెట్టారు. కానీ దేనిమీద? అని ప్రశ్న వేసుకొంటే శంకర్‌కైనా సమాధానం దొరుకుతుందో లేదు. కథ, స్క్రీన్ ప్లే.. ఈ విషయాల్లో శంకర్ దారుణంగా తేలిపోయాడు. దాంతో తెరపై ఎన్ని హంగులున్నా మనసుకెక్కలేదు.
‘భారతీయుడు’ అనేది ఓ తరానికి సూపర్ హిట్, మైల్ స్టోన్, ఎవర్ గ్రీన్ మూవీ.
‘భారతీయుడు 2’ అనేది ఈ తరానికి.. ఓ సాదా సీదా సినిమా. ఈ 28 ఏళ్లల్లో అన్నీ మారిపోయాయి. శంకర్ కూడా. పాత శంకరే బాగున్నాడు కదా, అని పాత భారతీయుడునే మళ్లీ చూసుకోవడం మినహా.. ఏమీ అనలేని, అనుకోలేని నిస్సహాయత.. శంకర్ అభిమానులది.
తెలుగు360 రేటింగ్: 1.5/5
– అన్వర్