అసాధ్యాలను సుసాధ్యం చేయడం శంకర్ స్టైల్. వెండి తెరపై కనీ వినీ ఎరుగని భారీతనాన్ని చూపించడంలో శంకర్ తరవాతే ఎవరైనా..?? ఓ దక్షిణాది చిత్రానికి రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడం ఇది వరకెప్పుడైనా విన్నామా? దాన్ని శంకర్ రోబో 2.ఓతో సాధించాడు. అలాంటి శంకర్‌కే ఓ ప్రాజెక్ట్ కష్టసాధ్యమనిపిస్తోంది. అదే… `భాయతీయుడు 2`.
కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. `రోబో 2.ఓ` కోసం ఎంత కష్టపడ్డాడో, అంతకంటే ఎక్కువగా భారతీయుడు 2 కోసం కష్టపడాలని అంటున్నాడు శంకర్. ”బడ్జెట్ పరంగా కాకపోవొచ్చు. కానీ శరీరకంగా మానసికంగా రోబో 2 కంటే భారతీయుడుకే ఎక్కువ కష్టపడాలి’ అంటున్నాడు శంకర్. డిసెంబరు నుంచి ‘భారతీయుడు 2’ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. కమల్‌హాసన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు కాబట్టి, తన రాజకీయ ప్రస్థానానికి ఈ సినిమా ఉపయోగపడేలా చూసుకుంటున్నాడన్నది ఫిల్మ్ నగర్ వర్గాల ఉవాచ. అయితే శంకర్ మాత్రం ఈ కథకీ రాజకీయాలకూ ఏమాత్రం సంబంధం లేదని తేల్చేస్తున్నాడు. ”కమల్ రాజకీయాల్లోకి రాక ముందే… ఈ కథ రెడీ అయ్యింది. కమల్, రజనీలలను రాజకీయ నాయకులకంటే హీరోలగానే ఎక్కువ చూస్తా” అన్నాడు శంకర్.