రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో సినిమా అనగానే.. మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. ఎందుకంటే.. శంకర్ స్టామినా వాళ్లకు బాగా తెలుసు. తనదైన రోజున బాక్సాఫీసు షేక్ చేసేసే సినిమా ఇవ్వగలడు. అందుకే ఈ సినిమాపై ముందు నుంచీ అంచనాలు పెరిగిపోవడం మొదలెట్టాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి అనుకోని బ్రేక్ పడింది. దానికి కారణం.. `ఇండియన్ 2`.
కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ముందు నుంచీ అవాంతరాలే. శంకర్ కూ నిర్మాణ సంస్థకూ… బోలెడు గొడవలు. కమల్ హాసన్ మద్యవర్తిత్వం వహించి ఓ పరిష్కార మార్గం చూపించాలని ట్రై చేశాడు. కానీ కుదర్లేదు. అలా ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమాని అలానే పక్కన పెట్టేసి, రామ్ చరణ్ సినిమా మొదలెట్టాలని శంకర్ ఫిక్సయ్యాడు. అయితే లైకా నిర్మాతలు ఈ విషయమై కోర్టుని ఆశ్రయించారు. `ఇండియన్ 2` పూర్తవ్వకుండా… శంకర్ మరో సినిమా చేయడానికి వీల్లేదంటూ పిటీషన్ వేశారు. ఇది వరకే… ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ మొత్తం… లైకా ప్రొడక్షన్ డిపాజిట్ చేసింది. 230 కోట్లతో సినిమాని పూర్తి చేయాలన్నది ముందస్తు ఒప్పందం. ఇప్పటికే 180 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. మిగిలిన 50 కోట్లు కూడా డిపాజిట్ చేసి, సినిమాని పూర్తి చేయాలని పట్టుపడుతున్నారు. మరి శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.