భారతీయ వాయుసేనలో ఉద్యోగిగా పనిచేస్తున్న రంజీత్ అనే ఉద్యోగి గూడచర్యానికి పాల్పడుతున్నందుకు నిన్న డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు పంజాబ్ లోని భటిండా జిల్లాలో అరెస్ట్ చేసారు. కేరళకు చెందిన రంజీత్ వాయుసేనకు చెందిన రహస్యాలను పాకిస్తాన్ గూడచర్య సంస్థ ఐ.ఎస్.ఐ.కు అందజేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించడంతో అతనిని క్రిందటి నెలే ఉద్యోగంలో నుంచి తొలగించారు.
ఇంటర్నెట్ లో పరిచయమయిన ఒక మహిళ అతనిని ఈ పనికి పురికొల్పిందని ప్రాధమిక విచారణలో తెలిసింది. వాయుసేనకు చెందిన రహస్య సమాచారాన్నిరంజీత్ ఆమెకు ఈ-మెయిల్స్, ఎస్.ఎమెస్. మెసేజుల ద్వారా పంపించేవాడు. కొన్ని రోజుల క్రితమే డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు జమ్మూలో సరిహద్దు భద్రతాదళాలకు చెందిన అబ్దుల్ రషీద్ అనే సైనికుడిని ఇవే కారణాలతో అరెస్ట్ చేసారు. అతని ద్వారా మహమ్మద్ ఖైఫతుల్లా అనే పాకిస్తానీ ఏజంటుని, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. కానీ వారికీ రంజీత్ కి ఏదయినా సంబంధం ఉందా లేక అతనిని ఆ మహిళా ఏజెంట్ ఒక్కరే వేరేగా హ్యాండిల్ చేస్తోందా? అనే విషయాలు పోలీసుల విచారణలో కనుగొనవలసి ఉంది. పోలీసులు రంజీత్ ని అరెస్ట్ చేసి డిల్లీకి తరలించారు. త్వరలో కోర్టులో హాజరుపరుస్తారు.
ఒకవైపు భారత్-పాక్ ప్రధానులు చాలా ఆప్త మిత్రులులాగ వ్యవహరిస్తూ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపరిచే ప్రయత్నాలు చేస్తుంటే, పాక్ ఐ.ఎస్.ఐ.సంస్థ, భారత్ లో గూడచర్యానికి పాల్పడుతోంది. ఇటువంటి చర్యలే ఇరు దేశాల సంబంధాలు చెడిపోయేందుకు కారణం అవుతాయని పాక్ ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? లేక తెలిసీ తెలియనట్లు నటిస్తోందా?