భారతీయ వాయుసేనకి చెందిన ఏ.ఎన్.32 రవాణా విమానం అకస్మాత్తుగా ఈరోజు ఉదయం కనబడకుండా పోయింది. తమిళనాడులోని తాంబరం విమానాశ్రయం నుంచి ఇవ్వాళ్ళ ఉదయం 7.26 గంటలకి బయలుదేరిన ఆ విమానంలో వాయుసేనకి చెందిన 29మంది, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమానం తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ కి బయలుదేరిన ఆరు నిమిషాలకే అంటే 7.32 గంటలకే చెన్నైలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత సుమారు గంటసేపు వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ పై కనిపిస్తూనే ఉంది.
ఈ వార్త తెలియగానే భారత వాయుసేన, నావికాదళ బృందాలు హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. తాంబరం, పోర్ట్ బ్లెయిర్ మధ్య బంగాళాఖాతంలో విమానం రాడార్ పై చివరిసారిగా కనిపించిన ప్రదేశంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం బయలుదేరినప్పుడు వాతావరణం కూడా బాగానే ఉందని అధికారులు చెపుతున్నారు. ఒకవేళ విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లయితే ఆ విషయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి తెలియజేసి ఉండాలి. కానీ విమానం టేకాఫ్ తీసుకొన్న ఆరు నిమిషాల తరువాత రేడియో కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఆ తరువాత సుమారు గంటసేపు రాడార్ పై విమానం కనిపించింది. కనుక ఉగ్రవాదులెవరైనా దానిని హైజాక్ చేసి దారి మళ్ళించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు ఆ విమానం ఆచూకి కనుగొనలేకపోయారు.
ఆ విమానం చెన్నై కేంద్రం నుంచి నియంత్రించబడుతుంటుంది. దానిని చెన్నై-పోర్ట్ బ్లెయిర్ మద్య వాయుసేన సిబ్బంది, వారికి సంబంధించిన వస్తువులు, ఆయుధాలు వగైరా రవాణాకి ఎక్కువగా వినియోగిస్తుంటారు.