భారత త్రివిధ దళాల చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తమిళనాడులోని కూనూరు దగ్గర కూలిపోయింది. పర్వాత ప్రాంతాలైన నీలగిరీస్ జిల్లాలో ఇది ఉంది. ఓ ఆర్మీ సంబంధిత కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి ఎంఐ 17 హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయి గోప్యత పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో తొమ్మిది మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. రావత్ తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు.
2019లో ఆర్మీ చీఫ్‌గా రిటైరన ఆయనను నరేంద్రమోడీ ప్రభుత్వం భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ గా నియమించింది. 2019 వరకు భారత్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అనే పోస్ట్ లేదు. కార్గిల్ యుద్ధం అనంతరం సీడీఎస్ నియామక ప్రతిపాదన వచ్చింది. దాన్ని మోడీ సర్కార్ అమలు చేసింది. గతంలో వాయుసేన, ఆర్మీ, నౌకాదళం మూడింటికి వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. అయితే వారందర్నీ సమన్వయం చేసుకోవడానికి ఓ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో సీడీఎస్ పదవికి కేంద్రం సృష్టించింది. 2019లో తొలిసారిగాబ బిపిన్ రావత్‌ను నియమించారు. వచ్చే జనవరిలోఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. ఈ లోపు హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది.
బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే.. కేంద్ర మంత్రివర్గ సమావేశం అయింది. తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. అత్యంతసున్నితమైన విషయం కావడంతో కేంద్రమే అధికారికప్రకటన చేయనుంది.