భారత సైనిక దళాల చీఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉదయం తమిళనాడులోని వెల్లింగ్టన్లో ఉన్న ఆర్మీ స్టాఫ్ కాలేజీలో శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు కోయంబత్తూరు నుంచి సైనిక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. ఆయనతో పాటు భార్య మధులికతో పాటు మరికొంత మంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. అయితే అనూహ్యంగా మరో పది నిమిషాల్లో స్టాఫ్ కాలేజీకి చేరుకుంటారనగా.. కన్నూరు వద్ద హెలికాఫ్టర్ కూలిపోయింది.
ప్రతికూల వాతావరణం లేకపోయినా.. ప్రపంచంలోనే ది బెస్ట్ అనే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్నా ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. హెలికాఫ్టర్‌లో ఉన్న వారిలో ఒకరు 80 శాతం గాయాలతో చావుబతుకుల్లో ఉండగా మిగతా పదమూడు మంది చనిపోయారు. వారిలో బిపిన్ రావత్ కూడా ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. అన్ని దళాలకు చీఫ్ స్థాయి వ్యక్తి ఇలాంటి ప్రమాదంలో మరణించడంతో కేంద్రం అలర్ట్ అయింది.
అసలు ప్రమాదం ఎలా జరిగిందో… కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. 2019లో ఆర్మీ చీఫ్‌గా రిటైరన బిపిన్ రావత్‌కు.. కేంద్రం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్ట్ క్రియేట్ చేసి.. పదవి ఇచ్చింది. అంటే అన్ని రకాల దళాలకు అధిపతి అన్నమాట. మూడేళ్ల ఈ పదవి కాలం.. వచ్చే జనవరిలోనే ముగియనుంది. ఈ లోపే ఆయన ప్రమాదానికి గురై చనిపోయారు.
బిపిన్ రావత్ తండ్రి కూడా సైన్యంలోనే పని చేశారు. నలభై రెండేళ్లుగా ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్నారు. అనేక రాష్ట్ర పతి పతకాలను అందుకున్నారు. బోర్డర్లో దళాలను నడిపించడంలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది.