భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం అంటున్నారు కానీ.. నిజానికి అది తిరోగమనంలోకి చేరింది. విదేశీ మదుపర్లు సహా.. అందరూ భారత్‌పై నమ్మకం కోల్పోతున్నారు. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. జీడీపీ పడిపోవడమే కాదు.. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా… ప్రతీ రంగం తిరోగమనంలో పడిపోయింది. స్టాక్ మార్కెట్లలో రోజుకు.. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. రూపాయి విలువ కూడా అంతకంతకూ దిగజారిపోతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.27 పైసలకు చేరుకుంది. ఇది ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టంగా మారింది.
ఉద్దీపన చర్యలు.. సంస్కరణలు అంటూ… బ్యాంకుల విలీనం నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో పోటుగా మారింది. 10 ప్రభుత్వ బ్యాంకుల షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నష్టాల బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం సంకేతాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా.. వెలువడుతున్న గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జీడీపీ దిగజారుతుందని తెలిసిన వెంటనే మైక్రో ఎకనామిక్ డేటా విడుదలైంది. అటు డొమెస్టిక్ వినియోగం భారీగా తగ్గింది. రూరల్ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిరుద్యోగం పెరగడం, రుణాలు దొరకకపోవడం ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఆటోమోబైల్ ఇండస్ట్రీ ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉంది. కొనుగోళ్లు లేకపోవడంతో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు ఉత్పత్తి తగ్గించాయి. దీని ద్వారా ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే గత ఆగస్ట్‌లో ఆటోమోబైల్ అమ్మకాలు రెండంకెలకు పైగా పడిపోయాయని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శనగా చెబుతున్నారు. ఇక ఉత్పత్తి రంగం 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆగస్ట్‌లో అన్ని రంగాలు నేలచూపులు చూడటంతో.. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏం చేసినా.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చేతులు కాలిపోయాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.