సాధారణంగా తప్పు చేసినవాడు నలుగురిలోకి రావడానికి జంకుతాడు. కానీ భారత్ లో 17 బ్యాంకులకి కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఎవరూ ఆహ్వానించకపోయినా, మొన్న గురువారం లండన్ లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి దర్జాగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత సుషీల్ సేత్, ప్రముఖ జర్నలిస్ట్ సన్నీ సేన్ కలిసి రచించిన “మంత్రాస్ ఫర్ సక్సెస్” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జరిగింది. ఆ కార్యమానికి భారత్ హై కమీషనర్ నవతేజ్ సర్ణా అతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి విజయ్ మాల్యా కూడా తన కుమార్తెతో కలిసి వచ్చి కూర్చొన్నారు. ఆయన రావడం చూసిన నవతేజ్ సర్ణా ఆ కార్యక్రమం ఇంకా మొదలవక మునుపే లేచి వెళ్ళిపోయి తన నిరసన తెలిపారు. ఆ కార్యక్రమానికి ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదని, దానిలో అందరూ పాల్గొనవచ్చని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినందున అది చూసి విజయ్ మాల్యా వచ్చి ఉంటారని ఆ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. నవతేజ్ సర్ణా ఆవిధంగా చేయడాన్ని భారత్ విదేశాంగ శాఖ కూడా సమర్ధించింది. భారత్ ప్రభుత్వం చేత నేరస్తుడుగా ముద్ర వేయించుకొని తప్పించుకొని తిరుగుతున్న విజయ్ మాల్యా పాల్గొన్న ఆ కార్యక్రమంలో భారత్ హై కమీషనర్ కూడా పాల్గొనడం సముచితంగా ఉండకపోవచ్చు కానీ ఆయన కార్యక్రమం మద్యలోనే బయటకి వెళ్లిపోవడం కంటే, విజయ్ మాల్యానే బయటకి పంపించివేసి ఉండి ఉంటే, ఆయనకి చెప్పుతో కొట్టినట్లు ఉండేది. కానీ ఆవిధంగా చేస్తే ఆ కార్యక్రమం రసాభాసగ మారే ప్రమాదం ఉండేది. ఆవిధంగా చేయడం ఒకవేళ బ్రిటన్ చట్టాల ప్రకారం నేరమయితే అది మరొక సమస్య అవుతుందనే కారణంతోనే నవతేజ్ సర్ణా మౌనంగా నిష్క్రమించి ఉండవచ్చు. నేరస్థుడిగా ముద్రపడ్డ విజయ్ మాల్యా దర్జాగా కార్యక్రమంలో పాల్గొంటే, అత్యున్నత హోదాలో ఉన్న నవతేజ్ సర్ణా ఏదో తప్పు చేసినట్లు బయటకి వెళ్లిపోవలసి రావడమే చిత్రంగా ఉంది.