ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకం తగ్గిపోతే వచ్చే ఫలితాలపై నమ్మకమూ తగ్గిపోతోంది. దురదృష్టవశాత్తూ ఇండియాలో రాజకీయపార్టీలు ఓడిపోయినప్పుడల్లా ఫలితాలను ప్రశ్నిస్తున్నాయి. ఈవీఎంల మ్యాజిక్ అంటున్నాయి. ఈ క్రమంలో ఇతర దేశాల్లో ఎవరైనా ఈవీఎంలపై మాట్లాడితే వెంటనే మన దేశంలో అలజడి ప్రారంభమవుతుంది. అమెరికా ఇంటలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ భారత ఈవీఎంలు హ్యాక్ అవుతాయంటూ వ్యాఖ్యలు చేశారని తాజాగా కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఆమె అన్నది అసలు వేరు..అయినా భారత్ లో చర్చ జరుగుతోంది.
భారత ఈవీఎంల గురించి తులసి గబ్బార్డ్ మాట్లాడలేదు !
ఈవీఎం పని తీరు గురించి తులసి గబ్బార్డ్ మాట్లాడింది నిజమే కానీ ఆమె ఇండియా ఈవీఎంల గురించి మాట్లాడలేదు. ఇతర దేశాలు అన్నారు.. ముఖ్యంగా ఇంటర్నెట్తో అనుబంధానమై ఉండే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఆమె అన్నారు. భారత ఈవీఎంలు ఇంటర్నెట్ తో హ్యాక్ అయ్యే అవకాశమే ఉండదు. ఎందుకంటే వాటిని కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ వంటి పరికరాలు ఏమీ ఉండవు. ఒక ఈవీఎంకు..మరో ఈవీఎంకు సంబంధం ఉండదు. కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. చాలా మంది ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు కానీ ఒక్కరూ నిరూపించలేకపోయారు.
ఓడిపోయిన ప్రతి ఒక్కరి నింద ఈవీఎంలపైనే !
మన దేశంలో ఈవీఎలంను వ్యతిరేకించని పార్టీ లేదు. చివరికి బీజేపీ కూడా ఈవీఎంలకు వ్యతిరేకమే.కానీ ఎప్పుడు అంటే ఓడిపోతున్నప్పుడే. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది టీడీపీ. ఈవీఎంలను మించిన సెక్యూరిటీ ఓటింగ్ లేదని వాదించిన జగన్ రెడ్డి కూడా ఇప్పుడు ఈవీఎంలను నిందిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలతో వచ్చిన సమస్య ఏమిటంటే.. తాము ఓడిపోయినప్పుడు మాత్రమే నిందిస్తున్నారు. గెలిచినప్పుడు సమర్థిస్తున్నారు. దీని వల్ల వారి వాదనకు బలం ఉండటం లేదు. కానీ అందరూ ఈ సమస్యకు పరిష్కారం వెదకాల్సిందే.. అనుమానాలకు చెక్ పెట్టాల్సిందే అనుకుంటే మాత్రం.. ఓ నిర్ణయానికి రావొచ్చు.
మళ్లీ బ్యాలెట్లు కాకపోయినా నమ్మకం పెంచే మార్గాలుండాలి !
భారత ఈవీఎంలు చాలా పకడ్బందీగా ఉంటాయని చెబుతారు. ఓటు వేసినప్పుడు ఎవరికి ఓటు వేశామో ప్రింట్ వస్తుంది. దాన్ని ఓటు వేసే వారు చూస్తారు. వేరే వారికి ఓటు పడితే తెలిసిపోతుంది. ఎలాంటి కంప్లైంట్లే రాలేదు. అయితే ఇక్కడ ఆ ప్రింట్లు అన్నింటినీ లెక్కించేందుకు ఈసీ అంగీకరించడం లేదు. ర్యాండమ్‌గా కొన్ని లెక్కిస్తున్నారు. అన్నింటినీ లెక్కిస్తే.. ఈవీఎంలపై అనుమానాలు కొంత వరకూ తీరే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోతే అనుమానాలు పెరిగిపోతాయి. దీని వల్ల సమస్యలొస్తాయి కానీ తగ్గవు.