భారత్-పాక్ సరిహద్దులో నిత్యం తుపాకుల మోత మ్రోగుతోనే ఉంది. అడపాదడపా పాక్ ఉగ్రవాదులు భారత్ లో జొరబడుతూనే ఉన్నారు. వారిలో కొందరు భద్రతా దళాల చేతిలో హతమవుతుంటే మరి కొందరు సజీవంగా పట్టుబడుతున్నారు. కానీ మొగుడ్ని కొట్టి బజారు కెక్కినట్లుగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితికి భారత్ పై పిర్యాదులు చేస్తోంది. పాకిస్తాన్ లో నెలకొన్న అశాంతి, అరాచకంపై నుండి దేశప్రజల దృష్టి మళ్ళించేందుకే పాక్ ప్రభుత్వం ఎప్పుడూ భారత్ ని ఒక బూచిగా చూపిస్తూంటుంది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మళ్ళీ అటువంటి ప్రయత్నమే చేసారు. “కాశ్మీర్ సమస్య ఒక అసంపూర్ణ చర్చనీయాంశం. పాక్ భూభాగంలోకి భారత్ అడుగుపెట్టాలని ఆలోచిస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది,” అని అన్నారు. కానీ భారత్ ఎన్నడూ పాక్ మీద యుద్దానికి వెళ్లాలనుకోలేదు. పాకిస్తానే గత మూడున్నర దశాబ్దాలుగా భారత్ పైకి ఉగ్రవాదులను పంపిస్తూ పరోక్ష యుద్ధం చేస్తోంది. కార్గిల్ చొరబాటుకి ప్రయత్నించి భంగపడింది. ఒకపక్క చేయకూడనివి అన్నీ చేస్తూనే భారత్ పై ఆరోపణలు చేస్తూ భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది.
భారత్ ఇదివరకులాగ పాక్ పట్ల మెతక వైఖరి అవలంభించదని పాక్ గుర్తుంచుకోవాలని భారత ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. అయినప్పటికీ పాక్ తీరు మారకపోవడంతో భారత్ కూడా ఇప్పుడు అంతే ధీటుగా బదులిస్తోంది. ఇదివరకు కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘అది భారత్ లో అంతర్భాగమే దానిపై మరెవరి మధ్యవర్తిత్వం అంగీకరించబోమని’ అని భారత్ ఒక పడికట్టు ప్రకటన చేసి చేతులు దులుపుకొనేది. కానీ పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ, “ కాశ్మీర్ కి సంబంధించిన వివాదాస్పద సమస్య ఏదయినా ఉందంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగమే. గత ఆరున్నర దశాబ్దాలుగా భారత్ లో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కొంత భూబాగాన్ని పాక్ ఆక్రమించి తన అధీనంలో ఉంచుకోవడమే ఒక వివాదం. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేము ప్రాధాన్యతనిస్తున్నాము,” అని సమాధానం చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి బహుశః ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత ధీటుగా స్పందించలేదనే చెప్పవచ్చును. ఇంతవరకు పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల మీద తరచూ ప్రస్తావిస్తున్నప్పుడు భారత్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడటం ద్వారా పాకిస్తానే దురాక్రమణకు పాల్పడిందని చాటి చెప్పినట్లయింది. పాక్ అధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలదో లేదో తెలియదు కానీ ఆ సమస్యను లేవనెత్తడం ద్వారా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంతర్జాతీయ వేదికలపై సంజాయిషీ ఇచ్చుకొనే పరిస్థితి కల్పించింది.