స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ముస్లిమ్స్‌కి రక్షణ కల్పించే పార్టీలు కొన్నే ఉండేవి. ఆ తర్వాత కాలంలో ముస్లిం జనోద్ధరణ కోసమే ఉన్నామని ఎన్నో పార్టీలు చెప్పుకున్నాయి. ఇక ఇప్పుడైతే ముస్లిముల సర్వతోముఖాభివృద్ధి కోసం పోటీపడుతున్న నాయకులు ఎందరో? పార్టీలు ఎన్నో? కానీ లెక్కలేనంతమంది నాయకులు ముస్లింల జీవితాలను ఉద్ధరించాలనే తాప్రతయం, ఆతృతతో పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండడం లేదు. కొన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్‌లో ఉన్న పాతబస్తీని ఎంఐఎం పార్టీ, ఒవైసీలే పాలిస్తున్నారు. వాళ్ళు కూడా ముస్లిం జనాభా ఉద్ధరణ కోసం మాత్రమే ఉన్నవారు. కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత? అనే ప్రశ్నను ఒవైసీ బ్రదర్శ్ని అడిగితే వాళ్ళు కూడా అభివృద్ధి ఏమీ జరగలేదనే చెప్తారు. మరి ఆ ప్రజలకు ప్రతినిధులుగా వీళ్ళు ఏం చేస్తున్నట్టు?
ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ మన ముస్లిం జనోద్ధరణ నాయకులు ముస్లింలను ఉద్ధరించడానికి బయల్దేరారు…సారీ.. సారీ….ఉద్ధరిస్తాము అని చెప్పడానికి బయల్దేరారు. ఇప్పుడే ఎందుకు బయల్దేరారు అని అడుగుతారా? మీరు అమాయకులని లెక్క. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చాయి? అని అడుగుతారా? మీకు భారతదేశ రాజకీయాలు తెలిసిపోయినట్టు లెక్క. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అందుకే నాయకులందరికంటే ముందుగా మాయావతీజీ మేలుకొన్నారు. బిజెపిని తిట్టటం కంటే ముందు ఎస్పీ, కాంగ్రెస్‌లను తిట్టేశారు. ముస్లింలను కాపాడే (ఎవరి నుంచి…?) ఒకే ఒక్క పార్టీ మాదే అని, కాంగ్రెస్, ఎస్పీలాంటి పార్టీలకు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మోడీ పైన పడ్డారు.
మోడీ పాలనలో దేశంలోని ముస్లింలందరూ కూడా తీవ్ర వివక్షతకు గురవుతున్నారట. కేంద్రంలో కాషాయ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారట. మతోన్మాదులు బలపడుతున్నారట. ముస్లింలను హింసిస్తున్నారు అట……ఇదీ మాయావతిజీ మాటల సారాంశం. జాతి వివక్ష, దేశ ద్రోహం కేసులను మాయావతిపైన ఎందుకు పెట్టకూడదు? అన్నదమ్ముల్లా కలిసిపోయే అవకాశం లేకుండా చేస్తున్నవి ఇలాంటి మాటలే కదా? బలహీనులకు రక్షణ కల్పిస్తాం. పేదలను అభివృద్ధి చేస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం అని ప్రచారం చేసుకోవచ్చు కదా. అసలు లౌకిక దేశమైన భారత్‌లో మతాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడగడం న్యాయమేనా? ఇలాంటి మాటలన్నీ కూడా ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, మతాల పేరుతో ప్రజలను విభజించడం కిందకు రావా? మతం పేరు, కులం పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడుక్కునే నాయకులను ఎందుకు శిక్షించకూడదు? అలా చేయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. రాజకీయ ప్రచారం కోసం మతాలు, కులాల పేర్లు ప్రస్తావించకూడదు. మతాలు, కులాల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కోకూడదు. అలా చేసే నాయకులకు, పార్టీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా చేయాలి. దేశాన్ని అభివృద్ధి చేయడం తర్వాత…..మన నాయకులు సమాజానికి చేస్తున్న చెడును కొంత తగ్గించగలిగితే మాత్రం నాయకుల ప్రమేయం లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసుకోగల శక్తి సామర్ధ్యాలు భారతీయులకు పుష్కలంగానే ఉన్నాయి.