రైల్వే శాఖ ఆన్ లైన్ రైల్వే రిజర్వేషన్ల విధానంలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేసింది. దానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఇంతవరకు రిజర్వేషన్స్ చేసుకొనేవారికి కన్ఫర్మ్ టికెట్ దొరకనప్పుడు వారికి వెయిటింగ్ లిస్టు నెంబర్ కేటాయించబడేది. కానీ చివరి రోజు వరకు అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక ప్రజలు చాలా టెన్షన్ పడుతుండేవారు. తీరాచేసి చివరి రోజున ఆ టికెట్ కన్ఫర్ కాకపోతే వారి ప్రయాణం వాయిదా వేసుకోవడమో లేకపోతే అప్పటికప్పుడు బస్సులోనో దేనిలోనో టికెట్ కొనుకొని వెళ్ళవలసి వచ్చేది. ఈ సమస్యని గుర్తించిన రైల్వేశాఖ నవంబర్ ఒకటి సరికొత్త విధానం అమలుచేయబోతోంది.
దాని ప్రకారం కన్ఫర్మ్ టికెట్ రానట్లయితే అదే రూట్లో వెళ్ళే వేరే ఇతర రైళ్ళలో బెర్తులు లేదా సీట్లు ఖాళీ ఉన్నట్లయితే అందులో వెళ్లేందుకు ఇష్టపడితే వాటిలో కన్ఫర్మ్ టికెట్స్ కేటాయిస్తారు. దీనికోసం రిజర్వేషన్ ఫారంలోనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని సెలక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ రూట్లో అదే రోజు వెళ్ళే ఇతర రైళ్ళలో దేనిలో ఒకదానిలో కన్ఫర్మ్ టికెట్ కేటాయించబడుతుంది. ఈ కొత్త విధానంలో ప్రయాణికులకు అనువయిన సమయంలో బయలుదేరేందుకు అవకాశం లేనప్పటికీ ఖచ్చితంగా వేరే రైల్లో కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది కనుక కొంత అటుఇటుగా తమ ప్రయాణం నిశ్చింతగా కొనసాగించవచ్చును. దీనివలన రైల్వేశాఖకు కూడా చాలా లాభం కలుగుతుంది. సాధారణంగా చాలా సార్లు ఒకే రూట్లో వెళ్ళే కొన్ని రైళ్ళు కిటకిటలాడుతూ వెళుతుంటే మరికొన్నిటిలో ఖాళీగా పోతుంటాయి. దానివలన రైల్వేశాఖకు చాలా నష్టం. ఈ సరికొత్త విధానం ద్వారా అటు ప్రయాణికులకు నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చును, రైల్వే శాఖకు నష్టాలు తగ్గించుకోగలుగుతుంది.