పాకిస్తాన్ మళ్ళీ కొత్త పేచి మొదలుపెట్టింది. ఆ దేశంలోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఇటీవల మహారాష్ట్రకు చెందిన కుల్భూషన్ యాదవ్ అనే మాజీ నేవీ అధికారిని అక్కడి పోలీసులు గూడచర్యం చేస్తున్నాడనే అనుమానంతో అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి నకిలీ పాస్ పోర్టులు, పత్రాలు, ఫోటోలు వగైరా స్వాధీనం చేసుకొన్నారు. అతను భారత్ కి చెందిన రీసర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)కి చెందిన గూడఛారని వారు అనుమానిస్తున్నారు. అతను కరాచీ, బలూచిస్తాన్ లలో గూడచర్యం చేయడానికే వచ్చేడని భావిస్తోంది. అతనిని ప్రశ్నించేందుకు పోలీసులు అరెస్ట్ చేసి ఇస్లామాబాద్ తరలించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లోని భారత హై కమీషనర్ గౌతం బాంబవాలేని పిలిపించుకొని, తమ దేశంలో భారత్ ఈవిధంగా గూడఛర్యానికి పాల్పడాన్ని నిరసన తెలియజేసింది.
బలూచిస్తాన్ రాష్ట్ర హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి పాక్ మీడియాతో మాట్లాడుతూ “కుల్భూషన్ యాదవ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకొన్న నకిలీ పాస్ పోర్టులలో ఒక దానిలో అతనిపేరు హుసేన్ ముబారక్ అని ఉంది. మరో దానిలో కుల్భూషన్ యాదవ్ అని ఉంది. వాటిలో అతని జన్మ తేదీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అతను ఇరాన్ దేశానికి చెందిన వీసాతో పాకిస్తాన్ లో ప్రవేశించినట్లు కనుగొన్నాము. ఇవన్నీ అతను భారత (రా) గూడచారని నమ్మేందుకు బలమయిన ఆధారాలే,” అని అన్నారు.
భారత్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్ ఆరోపణలను వెంటనే ఖండించింది. “భారత్ కి ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొనే ఆసక్తి లేదు. కుల్భూషన్ యాదవ్ మాజీ నేవీ అధికారి. అతను స్వచ్చంద పదవీ విరమణ (వి.ఆర్.ఎస్.) తీసుకొని ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కనుక అతనితో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఆ విషయం విచారణలో తేలుతుంది. పాకిస్తాన్ లోని భారత దౌత్య కార్యాలయ అధికారులు అతనిని ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాలని మేము పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము,” అని ఒక ప్రకటన విడుదల చేసారు.
“ఇదివరకు కూడా పాక్ ఇటువంటి నిరాధారమయిన ఆరోపణలే చేసింది. కానీ ఆ తరువాత ఆ ఆరోపణలలో అవాస్తవమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ స్వయంగా అంగీకరించారు. పాకిస్తాన్ లో ‘రా’ ఎటువంటి గూడచర్యం చేయడం లేదని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు కూడా. పాకిస్తాన్ లో గూడచర్యం చేయవలసిన అవసరం భారత్ కి లేదు,” అని విదేశాంగ ప్రతినిధి తెలిపారు.
సాధారణంగా భారత్-పాక్ మధ్య ఏదయినా సమావేశం వంటిది జరిగే ముందు పాకిస్తాన్ ఇటువంటి నాటకాలు ఆడుతుంటుంది. ఇదివరకు డిల్లీలో ఇరు దేశాల జాతీయ భద్రతాసలహాదారుల సమావేశం ముందు పాకిస్తాన్, ఇటువంటి కపటనాటకమే ఆడింది. వారి సమావేశంలో భారత్ లో కొనసాగుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి తమను నిలదీసే అవకాశం ఉందని గుర్తించిన పాక్ ప్రభుత్వం, ముందుగా కాశ్మీరీ వేర్పాటువాదులతో సమావేశం అవ్వాలని పట్టుబట్టింది. భారత్ అందుకు అంగీకరించదని తెలిసే ఆవిధంగా నాటకం ఆది చివరికి సమావేశం జరగకుండా చేసి తప్పించుకొంది.
పఠాన్ కోట్ దాడులపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేయబడిన పాక్ ఉన్నతాధికారులతో కూడిన దర్యాప్తు బృందం రేపు డిల్లీ రాబోతోంది. అప్పుడు పఠాన్ కోట్ దాడులపై దర్యాప్తు పురోగతి గురించి వారిని భారత్ నిఘా సంస్థ అధికారులు గట్టిగా ప్రశ్నించడం ఖాయం. దానికి పాక్ వద్ద సంతృప్తికరమయిన సమాధానాలు లేవు కనుక, భారత్ ని తిరిగి నిందించేందుకు ఒక బలమయిన కారణం కావాలి కనుకనే పాక్ ఈ కొత్త పేచీ మొదలుపెట్టి ఉండవచ్చును.