లండన్లో జెండా పాతేందుకు ఇండియన్స్ పెట్టుబడులు పెడుతున్నారు. లండన్లో అత్యధికంగా ఆస్తులను భారతీయులు సొంతం చేసుకుంటున్నట్లుగా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. లండన్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు కలిగిన వర్గాల్లో భారత సంతతి వారు టాప్లో నిలిచారు. కొన్ని తరాలుగా అక్కడ నివసిస్తున్న భారత సంతతి వారితో పాటు, ఎన్నారైలు, భారతీయ ఇన్వెస్టర్లు, విద్య కోసం బ్రిటన్ వెళ్లిన వాళ్లల్లో అనేక మంది అక్కడ ఇళ్లను కొనుగోలుచేస్తున్నారు. బారెట్ లండన్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది.
2021 నాటికి ఇంగ్లండ్ అండ్ వేల్స్లో భారత సంతతి వారి మొత్తం జనాభా ఇరవై లక్షల వరకూ ఉంది. అక్కడి మైనారిటీల్లో అతిపెద్ద వర్గంగా భారత సంతతి వారు నిలిచారు. వీరిలో ఎక్కువ మంది లండన్ లో ఉంటున్నారు. లండన్ జనాభాలో ఏడు శాతం భారతీయులేనని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో భారతీయ కుబేరులు కూడా లండన్ లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంబానీ కుటుంబం లండన్ లో అత్యంత విలాసవంతమైన నివాసాన్ని ఎప్పుడో కనుగోలు చేసింది. వారి కుటుంబం అక్కడికి షిఫ్ట్ అవబోతోందన్న ప్రచారం జరిగింది. కానీ వారు హాలీడే హౌస్ కోసమే దాన్ని కొన్నట్లుగా తెలుస్తోంది.
క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా లండన్ కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇల్లు కూడా కొనుగోలు చేశారని అంటున్నారు. పలువురు సంపన్నులు.. లండన్ లో స్థిరపడే దిశగా ఆలోచిస్తున్నారు. ఇక అక్కడే ఉద్యోగాల కోసం వెళ్లి స్థిరపడిన వారు కూడా ఇళ్లు కొంటున్నారు. భారతీయులు తమ సంపాదనను దాచుకుని మొదటగా ఇళ్లు కొనుక్కుంటారు. లండన్ లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది.