కేంద్ర ప్రభుత్వ విధానాలో.. అంతర్జాతీయ పరిణామాలో కారణం ఏదైనా.. భారతదేశం వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అత్యంత తక్కువగా 4.5 శాతానికి పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి వృద్ధి రేటు 7 శాతం. అంటే.. పతనం చాలా వేగంగా సాగుతోందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి రేటు ఉండటంతో.. 2012 తర్వాత ఇదే మొదటి సారి. దేశంలోని అన్ని రంగాలు.. వెనుకబడుతున్నాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. వస్తు తయారీ, వ్యవసాయ రంగాల పనితీరు పేలవంగా ఉంది. వినియోగ డిమాండ్ తగ్గిపోయింది. ప్రైవేట్ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా.. దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి జారిపోయింది.
మాంద్యం వచ్చేసిందంటూ.. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు మోదీ సర్కారు ఈ మధ్యకాలంలో పలు తాయిలాలు ప్రకటించింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేక నిధి ఏర్పాటు, బ్యాంకుల విలీనం, పలు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలాంటివి చేపట్టింది. ఇవన్నీ.. ఏ మాత్రం.. పరిస్థితుల్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడటంలేదు. రిజర్వ్ బ్యాంక్ సైతం కీలక వడ్డీ రేట్లను వరుసగా తగ్గించుకుంటూ పోయినా గుణం కనిపించడం లేదు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటూ ప్రధాని మోడీ కలలు కంటున్నారు. ఈ వృద్ధి రేటు ఇలాగే ఉన్నా.. ఇంకా తగ్గినా… ఆ కల భారత్‌కు…దరిదాపుల్లో నిజం అయ్యే పరిస్థితులు లేవు.
సగటున 8-9 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోవాలన్న ఆశయాలున్న భారత్‌లో 4.5 శాతం వృద్ధి రేటు ఆందోళనకరమని ప్రపంచ ఆర్థిక వేత్తలు సైతం.. అంటున్నారు. మళ్లీ 8 శాతం వృద్ధిరేటుతో దూసుకెళ్లాలంటే వ్యవస్థలో పరిస్థితులను మార్చాలని.. మాజీ ప్రధాని మన్నోహన్ సింగ్.. కేంద్రానికి సూచించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత .. ఫలితాలు దీర్ఘ కాలంలో వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ ఫలితాలు ఇవే కాబోలని.. సామాన్యులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టకుండా.. తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితులు వచ్చాయన్న భావన ఏర్పడుతోంది.