ఐపీఎల్ అయిపోయింది. ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ హంగామా మొదలైంది. జూన్ 2 నుంచే ఈ క్రికెట్ పండగ మొదలైంది. భారత్ ఈరోజు తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ తో తలపడనుంది. ఐర్లాండ్ తో మ్యాచ్ కాబట్టి వార్ వన్ సైడ్ అనుకోవాలి. కాకపోతే, టీమ్ ఇండియా మాత్రం పూర్తి స్థాయి జట్టుతోనే బరిలో దిగబోతోంది. ఇది టీ 20. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. అందుకే ఏ జట్టూనూ భారత్ తేలిగ్గా తీసుకోకూడదని భారత్ భావిస్తోంది. రోహిత్, కోహ్లి, పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసంగ్ తో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ దళంలో బుమ్రా, సిరాజ్‌లపై ఆశలు పెట్టుకొంది.
ఐపీఎల్ సీజన్ ఇటీవలే ముగిసింది. కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ విషయంలో భారత్ జట్టుకు ఢోకా లేదు. ఐర్లాండ్ కూ సంచలనాలు సృష్టించే సత్తా ఉంది. అందులో మంచి హిట్టర్లు ఉన్నారు. న్యూయార్క్‌లో మ్యాచ్ జరగబోతోంది. అక్కడ ఓ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ ఆడడం భారత్‌కు ఇదే తొలిసారి. బంగ్లాతో భారత్ ఓ వార్మప్ మ్యాచ్ ఆడింది. ఆ అనుభవం ఇప్పుడు బాగా పనికొచ్చే అవకాశం ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొనే ఛాన్స్ ఎక్కువ. ఒకవేళ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే, 160 పరుగులు చేసినా చాలు. మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ మ్యాచ్‌ని వీక్షించొచ్చు.