దేశంలోని అంతర్గత భద్రత మాత్రమే విదేశాలతో సంబంధాల విషయంలో భారత మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. రిటైర్డ్ అధికారి అయినా, భారత ప్రధాన మంత్రి కార్యాలయం అతన్ని ఇంకా కొనసాగిస్తుంది అంటే తన సత్తా ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అజిత్ దోవల్ కీలకంగానే ఉంటారు.
ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్ల తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో తలదాచుకోవటంలో కూడా తనదే కీలక పాత్ర. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ ఈ వారం రష్యా రాజధాని మాస్కోలో పర్యటించనున్నారు.
ఇటీవల భారత ప్రధాని మోడీ… ఉక్రెయిన్ ప్రధాని జెలెనెస్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ తో సత్సంబంధాలు కోరుకోవటంతో పాటు రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ముగిసేందుకు శాంతి చర్చలు అవసరం అని, అందుకు భారత్ ముందుంటుందని ప్రకటించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ మోడీ ఫోన్ లో చర్చలు జరిపారు. యుద్ధం ముగించాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవాలని కోరారు. భారత్ మధ్యవర్తిత్వానికి రెండు దేశాలు సానుకూలంగా ఉండటంతో చర్చల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.
పుతిన్ తో ఫోన్ లో చర్చల సందర్భంగా ప్రధాని మోడీ అజిత్ దోవల్ ను మాస్కో పంపిస్తానని ఇచ్చిన హమీ మేరకు తను పర్యటిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే, తన మాస్కో పర్యటన తర్వాత నేరుగా ఇండియా వచ్చేస్తారా లేక ఉక్రెయిన్ లోనూ పర్యటిస్తారా అన్న అంశంపై క్లారిటీ లేదు.
కానీ, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఉద్రిక్తతలను తగ్గించటంలో ఇండియా కీ రోల్ పోషించనుండగా… దాని వెనుక మాస్టర్ మైండ్ గా దోవల్ వ్యవహరించనున్నారు.