కేసీఆర్… జనాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎంత పేరుందో, రాజకీయాల్లో అంతే చాణక్యం ఆయనకి సాధ్యమనే ఇమేజీ ఉంది! తన రాజకీయ ప్రత్యర్థులను ఎంత చాకచక్యంగా ఎదుర్కోవాలో ఆయనకి తెలిసినంతగా వేరొకరికి తెలీదంటే ఆశ్చర్యం ఉండదు. అందుకు ఉదాహరణ రేవంత్ రెడ్డి వ్యవహారమే..! తాజాగా అదే తరహాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియంత్రించే బలమైన ఆయుధం ఆయనకి చేతికి అందిందా… అంటే, అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు..! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడిగా ఉత్తమ్ చేసిన కొన్ని పనులపై గట్టి నిఘా వేయించారనీ, దానికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయనీ, వాటితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని సందిగ్ధంలో పడేసే తరుణం కోసం వేచి చూస్తున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి.
గృహ నిర్మాణాల్లో అవకతవకలు వెలికి తీయాలని సీఐడీని కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో చేతివాటం చూపించిన చాలామంది జాతకాలు స్కాన్ అయిపోయినట్టు సమాచారం! వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆధారాలు లభించాయట. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ హయాంలో రాజీవ్ గృహ కల్ప ఇళ్ల నిర్మాణం కోసం ఏర్పడిన కార్పొరేషన్ అప్పట్లో నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఉన్నతాధికారులు వద్దని చెబుతున్నా ఎస్కలేషన్స్ పెంచాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలున్న కమిటీ సిఫార్సు చేసింది. పది కంపెనీలు ఇళ్ల నిర్మాణం చేపడితే, వాటిలో రెండు కంపెనీలు మాత్రమే ఎస్కలేషన్ పెంచేసి, వెంటనే బిల్లులు కూడా చెల్లించేశారు. అప్పటికి ఉత్తమ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. సో.. ఆ రెండు కంపెనీలకూ అంచనా కంటే దాదాపు రూ. 160 కోట్ల అదనం చెల్లించడం జరిగిందట! ఈ కంపెనీలకూ ఉత్తమ్ కీ మంచి సంబంధాలే ఉన్నాయని తాజా విచారణలో బయటపడిందట.
ఇప్పుడీ ఫైల్ కేసీఆర్ చేతిలో ఉందనీ, ఆయన సీఐడీకి ఆదేశం ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్ ఊచలు లెక్కపెట్టక తప్పదంటూ ఇప్పటికే కొంతమంది తెరాస నేతలు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారట! ఈ మేరకు అధికార పార్టీ లీకులు ఇస్తున్నా, దీనిపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఉత్తమ్ కూడా చేయడం లేదు. అందుకే ఉత్తమ్ ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించారనీ అంటున్నారు. ఎలాగూ తెరాసకు కావాల్సింది ఇదే కాబట్టి… కళ్లెం చేతులో పెట్టుకుని, కాంగ్రెస్ ను కేసీఆర్ ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి, దీనిపై మున్ముందు కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందో కూడా చూడాలి.