‘వి’ తరవాత ఇంద్రగంటి మోహన కృష్ణ భారీ ప్రణాళికలే వేసుకున్నాడు. నాగచైతన్య, విజయ్ దేవరకొండలకు ముందే లైన్ లో పెట్టుకున్నాడు. వీరిద్దరిలో ఒకరితో తన తదుపరి సినిమా పట్టాలెక్కాలి. కానీ… ఇద్దరు హీరోలూ… ఇంద్రగంటిని నిరీక్షణలో పెట్టేశారు. విజయ్ – పూరి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇది అవ్వగానే.. ఓ బాలీవుడ్ సినిమా చేయాలి. అప్పటి వరకూ ఇంద్రగంటికి విజయ్ దేవరకొండ అందుబాటులోకి రాడు. మరోవైపు నాగచైతన్య పరిస్థితీ అంతే. `లవ్ స్టోరీ` తరవాత.. విక్రమ్ కె.కుమార్ తో జట్టు కట్టబోతున్నాడు. `థ్యాంక్స్` సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ సినిమా పూర్తయ్యే వరకూ.. చైతూ మరో సినిమా చేసే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో.. ఇంద్రగంటికి హీరోలు కరువయ్యారు. ఇద్దరు హీరోలతో `ఓకే` అనిపించుకున్నా సరే, ఇప్పుడు సినిమా చేయడానికి హీరో కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి ఇదంతా ‘వి’ ఎఫెక్టే అనుకోవాలి. ఆసినిమా గనుక హిట్టయితే.. చైతూ ఆలోచనలో పడేవాడేమో. అటు విక్రమ్ సినిమానీ, ఇటు ఇంద్రగంటి సినిమానీ ఏక కాలంలో పూర్తి చేసేవాడు. కానీ `వి` ఫలితం తేడా కొట్టే సరికి.. అంత రిస్క్ చేయడానికి చైతూ సాహసించడం లేదు.
కాకపోతే ఇంద్రగంటి ప్లానింగులు వేరేలా ఉన్నాయి. ఈ గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. ‘శప్తభూమి’ నవల ఇంద్రగంటికి బాగా నచ్చింది. ఆ కథని వెబ్ సిరీస్ గా రూపొందించే అవకాశాలున్నాయి. అది కుదరని పక్షంలో అంతా కొత్తవారితో తన స్టైల్ లో ఓచిన్న సినిమా చేసే ఛాన్సుంది. మరి ఇంద్రగంటి దేన్ని ఎంచుకుంటాడో చూడాలి.