ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ధనవంతుల ద్వారా పేదలను పైకి తీసుకు వచ్చే వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇస్తున్న చంద్రబాబుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు అండగా నిలుస్తున్నారు. P4 పేరుతో ప్రారంభించిన ఈ పథకంలో మండలాల వారీగా పేదలను ఆదుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. మేఘా కృష్ణారెడ్డి , చలమలశెట్టి అనిల్, సజ్జన్ కుమార్ గోయెంకా లాంటి వాళ్లు ప్రారంభోత్సవ సభకు వచ్చారు. ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ఆలోచనలను అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
సీఎస్ఆర్ కింద నిధుల్ని వినియోగించే అవకాశం
కార్పొరేట్ కంపెనీలు… సీఎస్ఆర్ .. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో రెండు శాతం సమాజం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ నిధులతో బడా కార్పరేట్ కంపెనీలు ఈ P4లో భాగంగా ప్రజలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇది నేరుగా ప్రజలకు లబ్ది చేకూర్చడం… బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం కాదు. ఆ కుటుంబాలని ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకు వచ్చేది. అంటే ఆ కుటుంబాల్లో డబ్బు లేక చదువు ఆపేయడం.. చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం వంటి సమస్యలను ఈ కార్పొరేట్ కంపెనీలు పరిష్కరిస్తాయి.
ప్రయోగాత్మకంగా అమలు విజయవంతం అయితే చాలు !
ప్రస్తుతం ప్రాథమికంగా నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విధానం సక్సెస్ అయితే ఆయా కంపెనీలకు కూడా ఎంతో పేరు వస్తుంది. పైగా తమ డబ్బుకు సార్థకత లభిస్తుందని అనుకుంటారు. అందుకే నాలుగు మండలాల్లో ప్రారంభమైన ఈ పీఫోర్ ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వ వర్గాలతో పాటు … ఆయా కంపెనీల కార్పొరేట్ ప్రతినిధులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేయనున్నారు. ఓ మంచి సంకల్పంతో చంద్రబాబు ప్రారంభించిన ఈ పథకానికి బడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంతో.. ప్రభుత్వానికి పైసా ఖర్చులేకుండా పేదల్ని ఆదుకునేందుకు అవకాశం ఏర్పడింది.
పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే సక్సెస్సే !
పేదరికం నుంచి ప్రజల్ని బయటకు తీసుకు రావాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు ఈ ప్రయత్నం చేశారు. రేషన్ కార్డుల విషయాన్ని పక్కన పెడితే క్రమంగా ప్రజలు తమ జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. వారి కుటుంబాల్లో పిల్లలను చదివించలేకపోవడం .. ఆర్థిక నిరక్ష్యరాస్యత ఉండటం..అప్పుల ఊబిలో ఉండటం వంటి కారణాలతో పైకి రాలేకపోతున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ పీఫోర్ కార్యక్రమంతో అనుకున్న ఫలితాలు సాధించగలిగితే పేద ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగైన మార్పు కనిపించే అవకాశం ఉంది.