ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ రంగం విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోయింది. అయితే ఐటీకి ఎవరూ అదనంగా కొత్త విశేషణాలు జోడించే సాహసం చేయలేకపోయారు. కొత్త ఏపీ పరిశ్రమల మంత్రి మాత్రం మొదటి ప్రయత్నంలోనే అలాంటి చేంజ్ చేసేశారు. ఐటీని బీచ్ ఐటీగా చేసేశారు. ఏపీలో బీచ్ ఐటీని .. ఇతర దేశాల్లో ప్రమోట్ చేసి కంపెనీలను ఆకర్షిస్తామని ప్రకటించారు. బీచ్ ఐటీ అంటే అదేమీ ప్రత్యేకమైన సాప్ట్ వేర్ కాదు ఏపీలో బీచ్‌లు ఉన్నాయి కాబట్టి… బీచ్‌లను ఐటీని మిక్స్ చేసి బీచ్ ఐటీ అని ప్రమోట్ చేస్తామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు.
ఐటీకి బీచ్‌లకు ఏమిటి సంబంధం … అవి ఉంటే ఏమిటి.. లేకపోతే ఏమిటి అనే డౌట్ మనకు రావొచ్చు కానీ అడగకూడదు. మంత్రిగారు అలా అనుకున్నారు కాబట్టి చెప్పేశారు. ఐటీ రంగం అభివృద్ధి జరిగిన మెట్రో నగరాల్లో ఎక్కడా బీచ్ లేదు. అయినా అభివృద్ధి చెందింది. ఐటీ అభివృద్ధి చెందాలంటే బీచ్‌లను ప్లస్‌పాయింట్‌గా వాడాలనుకోవాలనుకునే ఆలోచనే ఓ వింత అయితే.. దానికి బీచ్ ఐటీ అని పేరు పెట్టి.. గొప్పగా చెప్పుకోవడం మరో విశేషం. ఎవరైనా తాము కల్పించే మౌలిక వసతులను గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి సాహసం చేయలేకపోతోంది.
సహజసిద్దంగా ఏర్పడిన బీచ్‌లను ప్రమోట్ చేస్తోంది. అదే సమయంలో విశాఖలో రుషికొండ వంటి వాటిని ధ్వంసం చేస్తూ.. బీచ్‌లను సౌందర్యాన్ని తగ్గించేస్తూ.. మరో వైపు వాటినే ఐటీకి అదనపు ఆకర్షణగా చెప్పడం ఏపీ ప్రభుత్వానికే సాధ్యం. విశాఖకు రావాల్సిన ఫ్రాంక్లీన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలనే తరిమేశారు. భూ కేటాయింపులురద్దు చేశారు. పార్లమెంట్లో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తర్వాత భూములిస్తామని చెప్పారు కానీ ఆ కంపెనీ పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వ ఐటీ అవగాహనపై ఇండస్ట్రీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఆ అవగాహనా స్థాయిని బీచ్ ఐటీ ప్రమోషన్ మరింత పెంచుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.