ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మొట్టమొదట అభ్యంతరం చెప్పిన రాష్ట్రం తమిళనాడు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ ఏపికి తరలివెళ్లిపోయే ప్రమాదం ఉంది కనుక ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఇదివరకు కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశారు. ఒక రాష్ట్రంలో వందలు లేదా వేల కోట్లు ఖర్చు చేసి స్థాపించిన పరిశ్రమలని ప్రత్యేక హోదా వలన అదనపు రాయితీలు, ప్రోత్సాహకాలు వస్తాయనే ఆశతో పొరుగు రాష్ట్రానికి తరలించడం సాధ్యమా అంటే కాదనే అర్ధం అవుతుంది. కొత్తగా ఏర్పాటు కాబోయే పరిశ్రమలు మాత్రమే తమకి ఏ రాష్ట్రంలో ఎక్కువ లాభం ఉంటుందని భావిస్తే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి మొగ్గు చూపుతాయి. ప్రత్యేక హోదా ఒక్కటే కాదు అవి వేరే అంశాలని కూడా పరిగణనలోకి తీసుకొంటాయని ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్ర శాసనసభలో చెప్పిన మాటలు వింటే అర్ధం అవుతుంది.
డిఎంకె సభ్యుడు టి.ఆర్.బి.రాజా అడిగిన ఒక ప్రశ్నకి ముఖ్యమంత్రి జయలలిత జవాబు చెపుతూ, “మీరు ఊహిస్తున్నట్లుగా మన రాష్ట్రంలో పరిశ్రమలు ఆంధ్రా, కర్నాటక రాష్ట్రాలకి తరలివెళ్లిపోవడం లేదు. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపిన మాట వాస్తవం. కానీ మన రాష్ట్రం నుంచి ఒక్క పరిశ్రమ కూడా ఆ రెండు రాష్ట్రాలకి తరలివెళ్ళలేదు. పరిశ్రమలు స్థాపించబడాలంటే ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉండాలి. పరిశ్రమలకి అవసరమైనంతా విద్యుత్ అందించగలగాలి. మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పుడూ అదుపు తప్పలేదు. అలాగే మనకి విద్యుత్ సమస్య కూడా లేదు. అందుకే ఆ రెండు రాష్ట్రాలు ఎన్ని తాయిలాలు ఆఫర్ చేస్తున్నా మన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు అక్కడికి వెళ్ళడం లేదు. ఆంధ్ర విషయానికి వస్తే అది నేటికీ ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి విధ్యుత్ కొనుగోలు చేసి నెట్టుకు వస్తోంది. కనుక మన రాష్ట్రంలో నుంచి ఏపికి పరిశ్రమలు తరలివెళ్ళే అవకాశమే లేదు,” అని చెప్పారు.
ఏపి, కర్నాటక రాష్ట్రాల కంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తమిళనాడు రాష్ట్రమే అన్ని విధాల అనువైనదని ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా చెపుతున్నారు. ఆమె ఇంత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో చెపుతున్నప్పుడు ఇంక ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం వ్యక్తం చేయవలసిన అవసరమే లేదు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉంచడం, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే ఆమె సూచనలని మన రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలకి కూడా వర్తిస్తుంది. ఆ రెంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం బాగానే కృషి చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించకుండ ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. కానీ అవి ప్రత్యేక హోదా పేరుతో అవి చేస్తున్న ధర్నాలు, బందులని చూసి రాష్ట్రానికి రావాలనుకొంటున్న కొత్త పరిశ్రమలు ఇరుగుపొరుగు రాష్ట్రాలకి తరలిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్దతులలో ఉద్యమించడాన్ని ఎవరూ కాదనరు కానీ అవి మితిమీరితే రాష్ట్రానికే నష్టం వస్తుందని ప్రతిపక్షాలు గ్రహించాలి.