దక్షిణాదికి చెందిన కొంత మంది సీనియర్ నేతలు పిల్లల్ని కనమని అదే పనిగా ప్రోత్సహిస్తున్నారు. స్టాలిన్, చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారు. ఇతరులు కూడా అదే చెబుతున్నారు. వీరు చెబుతున్న ప్రధాన కారణం జనాభాను నియంత్రించడం వల్ల దక్షిణాది నష్టపోతోందని.. ఎంపీ సీట్లు కూడా తగ్గిపోవడం. అయితే జనాభా నియంత్రణ వల్ల అలాంటి సమస్యలు రావని కేంద్రం చెబుతోంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ పాలక పార్టీలు అతి పెద్ద సమస్యను గుర్తించలేకపోతున్నాయి. అదే ఇన్ఫెర్టిలిటీ.
పిల్లలు తగ్గిపోవడానికి ఇన్ ఫెర్టిలిటీ కూడా కారణం
గతంలో మహిళలు గర్భం దాల్చితే ఆరో..ఏడో నెల వచ్చే వరకూ తెలియదు. ఎందుకంటే గ్రామాల్లో ఎలాంటి వైద్య సౌకర్యాలు ఉండవు. శరీరంలో వచ్చే మార్పును బట్టే వారు గర్భనిర్దారణ చేసుకుంటారు. అయినా అప్పట్లో పెద్దగా సమస్యలు వచ్చేవి కావు. అప్పట్లో పిల్లలు పుట్టని వారు ఉండేవారు.. కానీ చాలా పరిమితం. ఇప్పుడు ప్రతి రెండు జంటల్లో
ఓ జంటకు ఇన్ ఫెర్టిలిటీ సమస్య ఉంది. అందుకే ఇప్పుడు గల్లీ గల్లీకి ఫెర్టిలిటీ క్లీనిక్లు ఉన్నాయి. ఐవీఎఫ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఇన్ ఫెర్టిలిటీ ట్రీట్ మెంట్ అత్యంత ఖరీదు
పిల్లలు పుట్టకపోతే ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకునేవారు ..కాస్త డబ్బు , ఆదాయం ఉన్నవారు మాత్రమే. నిరుపేద, మధ్యతరగతి వాళ్లకు ఇన్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. అది చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. అందుకే ఇప్పుడు చాలా జంటలు పిల్లలు లేకపోయినా ఆస్పత్రుల్లో చూపించుకుంటే లక్షలు ఖర్చు పెట్టే స్థోమత లేక సైలెంటుగా ఉంటున్నారు. మామూలు కన్సల్టేషన్ దగ్గర నుంచి ఐవీఎఫ్ వరకూ వెళ్తే కనీసం పది లక్షలు ఖర్చు అవుతాయి. అంత భరించే సామర్థ్యం మధ్యతరగతి వర్గంలో ఉంటుందా?
ఈ సమస్యను ప్రభుత్వాలు గుర్తించాల్సిందే !
పిల్లల్ని కనాలని అదే పనిగా ప్రకటనలు చేయడం కాకుండా.. ముందుగా సమస్యలను గుర్తించాలి. జనాభా తగ్గిపోవడానికి నియంత్రణ కారణం కావొచ్చు కానీ.. అదొక్కటే కారణం కాదు. పిల్లలు కావాలని అనుకున్న ఎంతో మందికి ఇప్పుడు సాధ్యం కావడంలేదు. మారుతున్న జీవన శైలి దీనికి కారణం. దీన్ని వైద్యుల ద్వారానే సరి చేసుకోవాలి. ఇటీవల చిలుకూరు ఆలయ పూజారి.. పిల్లలు పుట్టడానికి ప్రసాదం ఇస్తానని.. అంటే.. పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అలోచించాలి.
ప్రభుత్వ ఫెర్టిలిటీ క్లినిక్లు పెట్టాలి !
ప్రభుత్వమే స్వయంగా ఫెర్టిలిటీ స్పెషాలిటీ క్లీనిక్లు పెట్టి.. అందరికీ ఈ విషయంలో ఉచిత ట్రీట్మెంట్ సౌకర్యాలు కల్పిస్తే..జనాభా పెరుగుదల సాధ్యమవుతుంది. పిల్లలు వద్దు అనుకునేవారి కన్నా.. కావాలి అనుకుని ఆ అదృష్టానికి నోచుకోని వాళ్లే ఎక్కువ. అందుకే ప్రభుత్వాలు .. ముఖ్యమంత్రులు ఈ సమస్యలను చూసిచూడకుండా ఉండలేరు.