కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే.. లాక్డౌన్ కొనసాగించాల్సిందేనని లేకపోతే.. అమెరికా, ఇటలీలా ప్రజలు వేల మంది ప్రాణాలు కోల్పోతారని కొంత మంది చెబుతున్నారు. అది వైరస్ కోణం. కానీ అసలు భయంకరమైన మరో కోణాన్ని మాత్రం చాలా తక్కువ మంది విశ్లేషిస్తున్నారు. అదే ఆకలి చావులు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి ఇదే విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. ఇంక ఎంత మాత్రమూ లాక్ డౌన్ పొడిగించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉపాధి కరువై నలభై రోజులవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులు.. కొంత జీతం తగ్గినా.. రెండు నెలలు జీతం రాకపోయినా.. ఆ తర్వాతైనా బతుకు మీద భరోసాతో ఉన్నారు. కానీ.. రోజు కూలీలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తి పనులు చేసుకునేవారకి నలభై రోజుల నుంచి పనులు లేవు. దేశంలో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది.
రూ. వెయ్యి ఇచ్చామని.. ఐదు కేజీల రేషన్ బియ్యం ఇచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ.. అవి వారి ఆకలిని ఎంత వరకు తీరుస్తున్నాయో అంచనా వేయడం కష్టమే. రోడ్ల మీదకు వందలు, వేలు, లక్షల్లా వస్తున్న వలస కూలీలు కడుపు మండి .. పోలీసులపై దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి వల్ల ఉపాధి పొందుతున్నారు, లాక్డౌన్ పొడిగిస్తే వీరంతా జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని ఇన్ఫోసిన్ నారాయణమూర్తి తేల్చి చెప్పారు. చాలా మంది ఆర్థిక వేత్తల అభిప్రాయం కూడా అదే. నిజానికి.. అసంఘిత రంగం.. బాగా పని చేస్తేనే… దేశంలో వృద్ధి రేటు బాగా పెరుగుతుంది.
సంఘటిత రంగం నుంచి వచ్చే వృద్ధి రేటు స్వల్పమే. అయితే.. ప్రస్తుతం అసంఘటిత రంగం ప్రమాదంలో పడింది. లాక్ డౌన్ వల్ల కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కాకపోతే.. ఆ రంగంలో కోట్ల మందికి ఆకలి బాధలు తప్పవు. ఇదే విషయాన్ని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్పారు. కరోనా ప్రభావం గురించి కాకుండా.. కేవలం.. ఆర్థిక వ్యవస్థ.. నిరుపేదల జీవనం గురించి ఆలోచిస్తే.. నారాయణ చెప్పింది కరెక్ట్ అని నమ్మక తప్పదు.