ఇప్పటివరకూ యూట్యూబ్‌లో ‘ఇంకేం ఇంకేం కావాలే…’ సాంగ్ లిరికల్ వీడియోను 7.70 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీడియో ఎడిటెడ్ వెర్షన్‌కు 8.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈమధ్య కాలంలో ఈ స్థాయిలో హిట్టయిన మరో తెలుగు పాట లేదంటే అతిశయోక్తి కాదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమాలోనిదీ పాట. ఆడియోలో ముందు విడుదల చేసిన పాట కూడా ఇదే. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’ అంటూ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. పాట విడుదల కాగానే… ‘సినిమాకు ఈ ఒక్క పాట చాలు, ఇంకేం వద్దు’ అనేంతలా అద్భుత స్పందన లభించింది. అయితే… ఈ పాట విజయ్ దేవరకొండ కోసమో? దర్శకుడు పరశురామ్ కోసమో? ‘గీత గోవిందం’ సినిమా కోసమో? చేసింది కాదు. అవును… నమ్మడానికి కష్టంగా వున్నా ఇదే నిజం.
ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్ నటించిన ‘నీవెవరో’ సినిమా గుర్తుందా? మొన్నామధ్య వచ్చి వెళ్ళింది. పెద్ద విజయం సాధించలేదనుకోండి. ఆ సినిమా కోసం గోపీ సుందర్ రెడీ చేసిన ట్యూన్ ఇది. ‘నీవెవరో’ సినిమాకు అచ్చు, ప్రసన్ సంగీతం అందించారు. వాళ్ళిద్దరి కంటే ముందు సంగీత దర్శకుడిగా గోపీ సుందర్‌ని అనుకున్నారు. అప్పుడు ‘ఇంకేం ఇంకేం కావాలే..’ ట్యూన్ చేశారు. తరవాత గోపీ సుందర్ ఆ సినిమా నుంచి తప్పుకోవడం, అదే ట్యూన్‌ని ‘గీత గోవిందం’కు ఇవ్వడం జరిగాయి. కొన్నిసార్లు ఈ విధంగా జరగడం సహజమే. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసినట్టు, ప్రతి ట్యూన్ ఎవరికి చెందాలో దేవుడు రాసి పెడతాడేమో!