ఆదాయానికి ఏదీ అనర్హం కాదు. సొంత మీడియాకు రూ. కోట్లకు కోట్లు దోచి పెట్టడానికి రాజకీయ విమర్శలను కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇదే చేస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, బీజేపీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఏపీ సర్కార్ ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. అందులో కేంద్రం ఎంత ట్యాక్స్ వసూలు చేస్తోంది.. రాష్ట్రం ఎంత వసూలు చేస్తోంది. కేంద్రం మళ్లీ తిరిగి ఎంత రాష్ట్రానికి ఇస్తోంది..? గతంలో చంద్రబాబు సర్కార్ ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఎంత వసూలు చేస్తున్నామో చెప్పుకొచ్చారు. ఈ మాత్రం దానికి రూ. కోట్లు పెట్టి ప్రకటనలు ఎందుకు ఇచ్చారో వారికి మాత్రమే తెలుసు.
2018లో రూ. 2 తగ్గించిన చంద్రబాబు.. ఇప్పుడు అవాస్తవాలతో ప్రకటనలు !
పన్నులు తగ్గించాలన్న డిమాండ్‌ను ఏ మాత్రం అంగీకరించడం లేదని.. పన్నులు తగ్గించే ప్రశ్నే లేదని చెప్పడానికి ప్రభుత్వం ప్రకటనల బాట ఎంచుకుంది. నేరుగా ఆ మాట చెప్పకుండా కేందరం వసూలు చేస్తున్న పన్నుల్లో వాటా రావడం లేదని చెప్పుకుంటోంది. అదే సమయంలో చంద్రబాబు హయాంలో ఉన్న ధరలకు అదనంగా ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశామని ఇంకేమీ పెంచలేదని చెప్పుకొచ్చింది. నిజానికి చంద్రబాబు పెట్రో ధరలపై రూ. రెండు అదనపు వ్యాట్‌ను 2018 సెప్టెంబర్‌లో తగ్గించారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో మాత్రం అదేమీ చెప్పలేదు. రూ. నాలుగు అదనపు ట్యాక్స్ ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ప్రకటనలో అవాస్తవాలు కూడా చెప్పారు. అయినా అందు కోసం రూ. కోట్లు వెచ్చించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగ్గిస్తామన్నారు కాబట్టే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు..!
ఇప్పుడు రేట్లు తగ్గించాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపించడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలే. దేశంలోనే పెట్రోల్, డిజిల్ రేట్లు అత్యధికంగా ఉన్నాయని ఆరోపించేవారు. బాదుడే బాదుడు అని తాము రాగానే తగ్గించేస్తామన్నారు. అయితే జగన్ వచ్చిన తర్వాత గత చంద్రబాబు ప్రభుత్వం తగ్గించినవే కాదు… కొత్తగా రోడ్ సెస్ వేశారు. కానీ ఆ సెస్ ఎటు పోతోందో కానీ రోడ్లు మాత్రం బాగుచేయడం లేదు. రెండున్నరేళ్లు దాటిపోయినా ఇంకా చంద్రబాబు హయాంలో రోడ్లు సరిగా నిర్వహించలేదని కబుర్లు చెబుతున్నారు .. వానా కాలం కబుర్లు చెబుతున్నారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ మాటలను మాత్రం ఈ ప్రకటనలో సీఎం జగన్ గుర్తు చేసుకోలేదు.
రాజకీయ ఎదురుదాడి చేస్తే ప్రజలకేంటి లాభం ? రేట్లు తగ్గిస్తేనే ఉపశమనం !
ప్రజలకు కావాల్సింది రాజకీయ ఆరోపణుల కాదు… రేట్ల తగ్గింపు. పెట్రోల్, డిజిల్‌పై కేంద్రం తగ్గించింది. రాష్ట్రం కూడా ఎంతో కొంత తగ్గిస్తేనే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పటికే పెట్రో ధరల కారణంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలతో మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగితికి చేరిపోతున్నారు. నిరుపేదల బతుకు భారం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ధరల విషయంలో విపక్ష పార్టీలపై రాజకీయంగా ఎదురుదాడి చేసి అదే గొప్ప అనుకుంటే ప్రజలు హర్షించరు. రేట్లు తగ్గిస్తేనే ప్రజలకు ఊరట లభిస్తుంది.