మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తిట్ల దండకం వినిపించడంపై ఏపీ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తమ మిత్రునికి కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వడం లేదు. ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీంతో బీజేపీ నేతల తీరుపై జనసేనలోనూ అసహనం కనిపిస్తోంది. చిత్ర పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ నేతలు వరుసగా వచ్చి ప్రెస్మీట్లుపెడుతున్నారు. వాటిలో అసభ్యకరమైన భాష వాడుతూ తిట్లు లంకించుకుటున్నారు.
చివరికి ఇటీవలి కాలంలో బయటకు రాని పోసాని కృష్ణమురళితోనూ తిట్టించారు. ఈ క్రమంలో జనసేన నేతలు కూడా వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తిట్లతోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారి వాయిస్ పెద్దగా బయటకు రావడం లేదు. మిత్రపక్షం తరపున బీజేపీ నేతలు ఎవరైనా బయటకు వస్తారేమో అని చూస్తున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదు. పవన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకున్న సోము వీర్రాజు కు కూడా.. తమ సీఎం అభ్యర్థిని బూతులు తిడుతున్నారన్న అంశాన్ని ఖండించాలని అనిపించలేదు.
బీజేపీ నేతల తీరుపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మంగళవారం మధ్యాహ్నం జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో ఉండి కంటి తుడుపుగాఓ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడకంకరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. కానీ జబీజేపీ నేతలకు జనసేన విషయంలో మంచి అభిప్రాయం లేదని వారికి వైసీపీనే ఇష్టమన్న అభిప్రాయం మాత్రం పవన్ కల్యాణ్ సేనలో ప్రారంభమైంది.