మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని నిర్వహిస్తున్న తీరు, అందులో గొడవలు, అవన్నీ మీడియాకు ఎక్కుతున్న వైనం.. ఇవన్నీ టాలీవుడ్‌ని విస్మయ పరుస్తున్నాయి. ‘మా’లో ఇది వరకూ గొడవలుండేవి. కానీ అవి నాలుగు గోడలకే పరిమితం. ఎప్పుడూ ఏదీ బయటకు ఎక్కలేదు. ఇప్పుడు అలా కాదు. చిన్న విషయానికే… గొంతులు చించుకుంటున్నారు. మీడియాకు దొరికేస్తున్నారు. కేవలం ఏడొందల మంది సభ్యులున్న ఈ సంఘం… ఒక్క తాటిపై లేదన్న విషయాన్ని పదే పదే… బలంగా చెప్పాలనే ప్రయత్నం మరింత బలంగా చేస్తున్నారు.
ఇది వరకు ‘మా’లో ఏ గొడవొచ్చినా – పెద్దలు అప్పటికప్పుడు ఓ నిర్ణయం తీసుకుని సెటిల్ చేసేసేవారు. అసలు ఏం జరిగిందన్న విషయం మూడో కంటికి తెలిసేది కాదు. ముఖ్యంగా దాసరి హయాంలో ఇలాంటి ఏ గొడవా బయటకు పొక్కేది కాదు. ‘మా’ కమిటీలో ఓ విషయంపై నిర్ణయానికి రాలేకపోతే… దాసరి ఇల్లు దానికి పరిష్కార మార్గం చూపించేది. ఎవరైనా ‘మా’ ఆంతరంగిక వ్యవహారాల్ని మీడియాకు లీక్ చేస్తే… వాళ్లని దాసరి గట్టిగా మందలించేవారు. దాసరికి భయపడి, ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవారు కాదు. ఇప్పుడు ఆయన లేరు. ‘మా’ విషయాల్ని పెద్దలెవ్వరూ సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. కొంతమందికి అధికారం చేతుల్లోకి రాగానే కోతికి కొబ్బరికాయ దొరికినంత హడావుడి చేస్తున్నారు. ఇంకొంతమంది `మా`లో ఏం జరుగుతున్నా మీడియాకు రహస్యంగా లీక్ చేయాలని చూస్తున్నారు. దాంతో… వ్యవహారాలన్నీ రోడ్డుకెక్కుతున్నాయి.
చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు… వీళ్లంతా ‘మా’ని నడిపించినవాళ్లే. ‘మా’లో ప్రస్తుతం ఏం జరుగుతోందన్న విషయం వాళ్లకు తెలుసు. ఎవరి వల్ల ఇదంతా జరుగుతుందో, ‘మా’ నిధులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో, ఎవరు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారో.. ఇవన్నీ బహిరంగ రహస్యాలు. ఇలాంటప్పుడు సినీ పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు. ‘మా’ అనేది వ్యక్తులు సమూమమే కావొచ్చు. కానీ దాని వెనుక.. చిత్రసీమ పరువు, ప్రతిష్టలు ముడిపడి ఉన్నాయి. `మా`లో గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే, సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాల్సింది. కానీ ఆలస్యమైపోయింది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రోడ్డుకెక్కి ఒకరిపై ఒకరు దూషణల పర్వానికి దిగకముందే.. సినిమా పెద్దలు కాస్త స్పందించాలి. ‘మా’ పరువుని, చిత్రసీమ ప్రతిష్టని నిలబెట్టేందుకు నడుం కట్టాలి. లేదంటే.. భారీ మూల్యం చెల్లించక తప్పదు.