సినిమా ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం నానా తిప్పలు పెడుతోందనేది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యం. సమస్యలు పరిష్కరించండి మహా ప్రభో అని ఆ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నది నిష్టూర సత్యం. తెలంగాణ ప్రభుత్వం పెద్దగా సాయం చేయకపోయినా సమస్యలు తెచ్చిపెట్టలేదు. కనీసం ఏమీ చేయకపోయినా కొత్తగా చిక్కులు తెచ్చి పెట్టవద్దని ఇండస్ట్రీ అంతా ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో విసిగి వేసారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయం కోసం అలా మాట్లాడలేదని ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఇండస్ట్రీ కోసమే మాట్లాడారని తెలుసు. కానీ ఆయనకు మద్దతు లభించిందా..?
రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఫిల్మ్ చాంబర్ తరపున నారాయణ్ దాస్ నారంగ్ ప్రకటన జారీ చేసి.. పవన్ కల్యాణ్‌ది వ్యక్తిగత అభిప్రాయమని తేల్చేశారు. ఈ నారంగ్ పేరును పదే పదే పేర్ని నాని ప్రెస్మీట్లో ప్రస్తావించారు. పవన్ వ్యాఖ్యలను ఖండించాలని కోరాడు. ఒక వేళ ఖండించకపోతే అంతకు మించి ఏమైనా చేస్తారని భయపడ్డారేమో కానీ అలా ప్రెస్‌మీట్ పూర్తయిపోయిన గంట తర్వాత ఫిల్మ్ చాంబర్ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిట్లయింది. ఇండస్ట్రీ కోసం గొంతెత్తిన పవన్ కల్యాణ్‌ను ఇది అవమానించడమే. మద్దతివ్వలేని నిస్సహాయ స్థితి ఉంటే సైలెంట్‌గా ఉన్నా బాగుండేదన్న అభిప్రాయం ఉంది.
ఇక హీరోలు మాత్రం కొంత మంది ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ధర్మాగ్రహం ఉందని.. ఇండస్ట్రీ అనేక సమస్యల్లో ఉందని.. అదీ కూడా ప్రభుత్వం వల్లేనని గుర్తిస్తూ తక్షణం పరిష్కరించాలని కోరుతూ కొంత మంది యువ హీరోలు బయటకు వచ్చారిు. నాని,కార్తికేయ, సంపూర్ణేష్ లాంటి వారు తమ మద్దతు తెలిపారు. ఇలాంటి విషయాల్లో అమెరికా అధ్యక్షుడ్ని కూడా ఒరేయ్ వెధవా అని పిలువగలికే ధైర్యం ఉన్న నిఖిల్‌కు ఇంకా తెల్లారినట్లుగా లేదు. ఆ అతికొద్ది మంది తప్పితే మిగిలిన వారు సైలెంటయిపోయారు. ఎవరూ ఇండస్ట్రీ కోసం నిలబడే ప్రయత్నం చేయడం లేదు.
ఇండస్ట్రీ మనుగడ సాగించాలంటే ప్రభుత్వాల సహకారం అవసరం అని చాలా మంది భావన. అయితే ఏ ప్రభుత్వమూ ఎలాంటి సహకారం ఇవ్వదు. ప్రజాధనం అసలు ఇవ్వదు. ఆటంకాలు సృష్టించకపోవడమే సహకారం. అలాంటి సహకారం ఇప్పటి వరకూ అన్ని అన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఆటంకాలు సృష్టించడం ద్వారా ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీని వేదనకు గురి చేస్తోంది. ఇప్పుడు తిరిగబడి హక్కులు సాధించుకోకపోతే .. భవిష్యత్‌లో వచ్చే ప్రభుత్వాలూ అదే చేస్తాయి. అంటే ఇక ఇండస్ట్రీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నట్లే అవుతుంది.