టీఆర్ఎస్ పార్టీ ఓనర్లం మేమే అంటూ మంత్రి ఈటెల చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తొలినుంచి ఉద్యమంలో ఉన్న వాళ్లం…మధ్యలో వచ్చిన వాళ్లం కాదని ఈటెల చేసిన కామెంట్స్ ..గులాబి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని కలిసిన ఎర్రబెల్లి తర్వాత ఈటలపై మాటల ఈటెలు సంధించింది. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ కేసీఆర్ ఒక్కరేనని తేల్చారు. అంతే కాదు.. ఈటల పదవికి ఢోకా లేదని… ఆయన ఆభయం ఇచ్చారు. మరో కీలక నేత ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్లంతా గులాబి జెండా ఓనర్లేనని ఈటల పార్టీలోనే ఉన్నాడు కదా ఇక సమస్య ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఈ రెండు స్పందనలూ హైకమాండ్ నుంచి వచ్చినవిగానే భావిస్తున్నారు.
రెండో సారి టీఆర్ఎస్ అధికారంలో కొచ్చిన తర్వాత మంత్రి వర్గ విస్తరణలో ఈటలకు చోటు ఉండదనే చర్చ జోరుగా సాగింది. చివరి నిమిషం వరకు ఈటలకు మంత్రిగా అవకాశం ఇస్తారా..లేదా అన్న సస్పెన్స్ కొనసాగింది. చివరకు ఈటెలకు మంత్రిగా అవకాశం ఇచ్చినా….అధికారాలు ఏం లేకపోవడంతో ఆయన అసంతృప్తిగానే ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. అంతే కాకుండా.. టీఆర్ఎస్లో కీలకనేతలను తప్పించే ప్రయత్నం అధిష్టానం చేస్తోందనే వాదన టీఆర్ఎస్ పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. హరీష్ రావు కు రెండు విడుతల్లోనూ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. నాయిని నరసింహారెడ్డికి సైతం మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదు. ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలను అందలం ఎక్కిస్తున్నారని నేతలు లోలోపలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించాలన్న నిర్ణయానికి .. కేసీఆర్ వచ్చారని.. అందుకే.. ఈటలపై.. పార్టీ నేతలతో ఎదురుదాడి ప్రారంభించారన్న వాదన.. టీఆర్ఎస్లో వినిపిస్తోంది. ఆయన పార్టీలోనే ఉన్నారు కదా.. అన్న సెటైర్లతోనే.. అసలు విషయం బయట పడుతోందంటున్నారు. గతంలో.. ఆలె నరేంద్ర కావొచ్చు.. విజయశాంతి కావొచ్చు… ఇతర నేతలు కావొచ్చు.. చాలా మందికి.. ఎదురైన పరిస్థితులే.. ఇప్పుడు.. ఈటలకు ఎదురవుతున్నాయని అంచనా వేస్తున్నారు.