సజ్జల రామకృష్ణారెడ్డికి వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ పదవి ఇవ్వడంపై ఆ పార్టీలో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. సజ్జల కోటరీ వల్లనే మొత్తం పార్టీ నాకిపోయిందని ఇప్పుడు మళ్లీ ఆయన తప్ప ఇంకెవరూ లేరన్నట్లుగా వ్యవహరించడం… ఇతర సీనియర్ నేతలను అవమానించడం ఏమిటని రగిలిపోతున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో పని చేసింది విజయసాయిరెడ్డి. ఆయన వ్యూహాలు ఫలించాయి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని అత్యంత ఘోరంగా పడిపోయేలా చేశారు. పార్టీ క్యాడర్ మొత్తం ఆయననే నిందిస్తోంది. అయినా జగన్ మాత్రం సజ్జలనే నమ్ముకున్నారు.
మామూలుగా ఓటములుకు బాధ్యులుగా చేసి పార్టీ నుంచి దూరం పెట్టాలని కేవలం మీడియాకే పరిమితం చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ జగన్ జుట్టు సజ్జల చేతిలోఉందేమో తెలియదు కానీ ఇప్పుడు .. సజ్జల చెప్పిందే జరుగుతోంది. ఆయన జగన్ పాలిట మరో లక్ష్మిపార్వతిలా మారాలన్న ఆరోపణలు వస్తున్నా లెక్క చేయడం లేదు. జగన్ సజ్జల సలహాలు విని కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఒక్క సజ్జల తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. పార్టీలో సీనియర్లు కూడా అదే అనుకుంటున్నారు. ఇక జగన్ రెడ్డికి.. వైసీపీకి ఎంత దూరం ఉంటే అంత మంచిదన్న భావనలో ఉన్నారని చెబుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెలరేగిపోవడానికి సజ్జల కారణం. అందుకే ఇప్పుడు ఓడిపోగానే ప్రతి ఒక్కరూ చెట్టుకొకరు.. పుట్టకొకరు పారిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయినా కనీసం మార్పు లేకపోవడం ఏమిటని.. పై స్థాయిలో బాగానే ఉన్నా.. కింది స్థాయిలో నేతలు బలి కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ వ్యవహారాల నుంచి దూరం పెట్టే వరకూ చాలా మంది సీనియర్లు నోరు విప్పే అవకాశాల్లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆ సీనియర్లను పార్టీ వీడి వెళ్లిపోయేలా చేస్తుందా లేకపోతే జగన్ సజ్జలను పక్కన పెట్టి సర్దుబాటు చేస్తారా అన్నదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.