దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తరువాత ఒకేసారి నాలుగువైపుల నుంచి దర్యాప్తులు, కోర్టులో విచారణలు చకచకా కొనసాగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒకవైపు దర్యాప్తు ప్రారంభించింది. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి.) కూడా ఈ ఎన్ కౌంటర్ పై మూడో రోజు విచారణను కొనసాగించింది. ఇదే రోజున హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కూడా విచారణకు స్వీకరించింది. సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ జరిగింది.
ఇవాళ్ల హైకోర్టు విచారణలో… నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలనీ, శుక్రవారం వరకూ భద్రపరచాలని ఆదేశించింది. ఎన్ కౌంటర్ పై దాఖలైన పిటిషన్లనూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్ కౌంటర్ విషయంలో గతంలో సుప్రీం కోర్టు చెప్పిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించారా లేదా అనీ, స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారా అని అడ్వొకేట్ జనరల్ ని కోర్టు అడిగింది. దీంతో ఏజీ స్పందిస్తూ మార్గదర్శకాలను పాటించారని వివరణ ఇచ్చారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్.ఐ.ఆర్. కాపీని సమర్పించాలని కోర్టు అడిగింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఓవైపున బుధవారం నాడు సుప్రీం కోర్టులో ఇదే కేసుపై విచారణ ఉంది కాబట్టి, గురువారం వరకూ వాయిదా కోరారు ఏజీ. దీంతో కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది.
సాధారణంగా, ఏదైనా ఒక కేసు లోయర్ కోర్టులో విచారణ జరుగుతుంటే… పైకోర్టులు అదే అంశమై విచారణను స్వీకరించవు. కింది కోర్టులో పూర్తయ్యాకే చూస్తామంటాయి. కానీ, దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో ఒకేసారి హైకోర్టు, సుప్రీం కోర్టులు స్పందించడం కొంత ప్రత్యేకమైన సందర్భమే. ఇవాళ్ల సుప్రీం కోర్టులో కూడా ఇదే కేసు విచారణకు వచ్చింది. ఇది హైకోర్టులో ఉంది కాబట్టి, అక్కడే విచారణ పూర్తి చేయాలనే ప్రస్థావన అక్కడ వచ్చినప్పుడు అడ్వొకేట్ స్పందిస్తూ… సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఫాలో కాలేదన్న అనుమానాలున్నాయన్నారు. కాబట్టి, వాదనలు వినాలని కోరారు. బుధవారం సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. చర్చంతా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించారా లేదా అనేదే ప్రముఖంగా వినిపిస్తోంది కాబట్టి, దీనిపై ముందుగా ఒక స్పష్టత సుప్రీం కోర్టులో వస్తే… ఆ తరువాత, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు విచారణ దానికి కొనసాగింపుగా ఉంటుందా లేదా అనేది చూడాలి.