న్యాయవ్యవస్థపై నిఘా పెట్టారని వస్తున్న ఆరోపణలో … విచారణ జరిపించాలనే డిమాండ్లు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఈ అంశంపై సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని … కొంత మంది న్యాయవాదులు ప్రకటించారు. న్యాయవ్యవస్థపై గురి పెట్టడం అసాధారణం అని.. ఇలాంటి వాటిని అసలు సహించకూడదని అంటున్నారు. ఇప్పటికే న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయించేందుకు చేసిన కుట్ర ఆడియో టేపులతో సహా బయటపడింది. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య మాట్లాడిన మాటలు.. దాని వెనుక ఉన్న అసలు కుట్రలను… జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ నాలుగు వారాల్లో వెల్లడించనుంది. ఈ లోపే ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది.
న్యాయమూర్తుల ఫోన్లపై నిఘా పెట్టారన్న ప్రచారం.. ప్రభుత్వంలోనూ కలకలం రేపింది. సాధారణంగా.. న్యాయవ్యవస్థపై నిఘా పెట్టేంత సాహసం… నిఘా వర్గాలు చేయవు. సామాన్యులకు అవసరం లేదు. ట్యాపింగ్ వ్యవహారాలన్నీ… సీక్రెట్‌గానే జరుగుతాయి. ఏ ప్రభుత్వం కూడా తాము ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పదు. ఆధారాలు కూడా ఉంచుకోదు. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి పనులు ధర్డ్ పార్టీకి అప్పగిస్తారు. ఎందుకంటే… ఏ మాత్రం తేడా వచ్చినా.. ప్రభుత్వాలే కుప్పకూలిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు న్యాయమూర్తులపై నిఘా విషయంలో ట్యాపింగ్ కు సంబంధించి పూర్తి ఆధారాలు సాంకేతికంగా కనిపెట్టిన తర్వాతనే… బయట పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరి ఫోన్లు.. ట్యాప్ చేశారు..? ఎలా చేశారు..? అనేది నిపుణులు మొత్తం నివేదికలు సిద్ధం చేశారని.. ఆ తర్వాతే ఈ విషయం బయటకు వచ్చిందని.. అంటున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా ఈ కథనాలపై ఉలిక్కి పడ్డారంటున్నారు.
న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బకొట్టాడనికి దారుణమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని హైకోర్టు కూడా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో.. జరుగుతున్న పరిణామాలు … న్యాయవ్యవస్థపై వైసీపీ నేతల విమర్శలు… ఆ తర్వాత ఈశ్వరయ్య టేపుల వ్యవహారం చూస్తే.. ఖచ్చితంగా ఏదో ఉందని అనుకుంటున్నారు. అందుకే…ట్యాపింగ్‌పై ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలైతే.. ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లే ట్యాప్ అయ్యాయని పత్రికలు రాశాయి కాబట్టి… ఆ విషయం వారికే స్పష్టత ఉంటుంది. ఒక వేళ ట్యాప్ అయితే.. విచారణకు ఆదేశించి.. తామే దర్యాప్తును పర్యవేక్షించవచ్చు. అదే జరిగితే.. నిఘా కుట్రలు బట్టబయలవుతాయని అంటున్నారు.