కరోనా దెబ్బకు భారతదేశ ప్రింట్ మీడియా మొత్తం సంక్షోభంలో పడింది. ఇప్పటికి రూ. నాలుగున్నర వేల కోట్ల నష్టాలు చూసిన పత్రికా రంగం వచ్చే ఆరు నెలల్లో అవి రూ. పదిహేను వేల కోట్లకు చేరుతాయని భయపడుతోంది. అదే జరిగిదే.. దేశంలో ఉన్న సుప్రసిద్ధి మీడియా సంస్థలన్నీ… లాకౌట్ అయిపోతాయని.. దాదాపుగా 30 లక్షల మంది ఉపాధి కోల్పోతారని…మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే… తమకు బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించాలంటూ.. కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడు శైలేష్ గుప్తా… కేంద్రప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు.
లాక్డౌన్ కారణంగా ప్రకటనలు లేవని.. పత్రిక సర్క్యూలేషన్ ఆదాయం కూడా రావడం లేదని.. మార్కెట్ దుస్థితిని తెలియచేసారు. ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో ప్రైవేటు రంగం నుంచి ప్రకటనలు కూడా లేవని గుర్తు చేశారు. కరోనా ప్రభావం తర్వాత కూడా ఉంటుందని స్పష్టం కావడంతో.. వచ్చే ఆరేడు నెలల తీవ్ర నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించాలని పత్రికా సమాజం కోరుతోంది. నేరుగా ఆర్థిక సాయం చేయాలని కోరడం లేదు కానీ.. పన్నుల భారం మాత్రం తగ్గించాలని కోరుతోంది. న్యూస్‌ప్రింట్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకం ఉంది. దీన్ని తీసేయాలని.. అలాగే.. పత్రికా సంస్థలకు రెండేళ్ల పన్ను విరామం ప్రకటించాలని కోరింది. అంతే కాదు.. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనల టారిఫ్‌ను యాభై శాతం పెంచాలని కూడా కోరింది. ప్రింట్ మీడియా కోసం ఉద్దేశించిన బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని కోరాయి.
లాక్ డౌన్ కారణంగా ఒక్క ప్రింట్ మీడియానే కాదు.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వాటికి ప్యాకేజీలు ప్రకటించే ఆలోచనలు చేస్తోందంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ.. తమ అవకాశాల్ని అందిపుచ్చుకుని సర్వైవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనాపై పోరాటంలో ఆర్థిక వెసులు బాటు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేపర్లలో ప్రకటనలు తగ్గించాలని కోరారు. కానీ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ బడ్జెట్ డబుల్ చేయాలని.. యాడ్ రేట్లు కూడా పెంచాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికర పరిణామం.