తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలకు రకరకాల అర్థాలు వుంటాయని ఇప్పుడు రాజకీయ వర్గాలు రూఢి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ వారైతే ఎప్పటికప్పుడు అభద్రతతోనే చూస్తున్నారట. ఈ మధ్యనే ఆయన సిటింగ్ ఎంఎల్ఎలు అందరికీ టికెట్లు ఇస్తానని చెప్పేశారు. అంతకు ముందు కొన్ని మాసాల కిందట తాను నియోజకవర్గాల వారిగా నివేదికలు తెప్పించానంటూ రేటింగ్స్ ప్రకటించి కంగారు పెట్టారు. తర్వాత మళ్లీ సర్దుబాటు చేసినా ఆ దెబ్బ పార్టీ నేతలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అందరికీ టికెట్ ఇస్తానంటే అస్సలు నమ్మడం లేదు. ఎందుకంటే వాస్తవికంగా అది సాధ్యమయ్యేది కాదు. నిజంగా అలా చేస్తే టిఆర్ఎస్ నుంచి చాలా మందిని వదులుకోవలసి వుంటుంది. వూరించిన నియోజవర్గాల పెంపు ఎలాగూ లేదు. ఇప్పుడు పాలకపక్షంలో వున్న 90+ ఎంఎల్‌ఎలలో మూడోవంతు మంది బయిటనుంచి వచ్చిన వారే. వారంతా గతంలో టిఆర్ఎస్ అభ్యర్థులనే ఓడించి వచ్చారు. మరి వీరందరికీ టికెట్టు ఇచ్చేస్తే వారేమయ్యేట్టు? తప్పనిసరిగా మరో పెద్ద పార్టీలో చేరి పోటీ చేస్తారు. ఎందుకంటే ఎలాగోలా నియోజకవర్గాలలో తమ హక్కు కాపాడుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు చేయడానికి వారు సిద్దంగా వుంటారు. ఈ క్రమంలోనే బాగా దెబ్బతిందనుకుంటున్న టిడిపిలోనూ కొందరు ప్రవేశించవచ్చునని, బిజెపి కాంగ్రెస్‌ల నుంచి మరింత మంది పోటీ చేయొచ్చని అనుకుంటున్నారు. కెసిఆర్ ప్రకటన తర్వాత ఆ విధమైన ఆలజడి అధికార పార్టీలో పెరగడం తథ్యంగా కనిపిస్తుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్టు ఒకే నియోజకవర్గంలో ఇద్దరు పోటీ దారులు వుండలేరు కదా.. అభద్రత పోగొట్టడానికి కెసిఆర్ చేసిన ప్రకటన దాన్ని మరింత పెంచడం ఇక్కడ విచిత్రం. ఇలాటి వారు ఇప్పటికే తమ గ్రూపులకు సంబంధించిన మంత్రులనూ లేదా కెసిఆర్ కుటుంబ సభ్యులను కలసి గోడు వెళ్లబోసుకుంటున్నారట