ఈ వారం రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. మనమంతా, శ్రీరస్తు – శుభమస్తు విడుదలకు సిద్ధమయ్యాయి. రెండుసినిమాలపై అంచనాలున్నాయి. మరి ఈ రెండింటి ల్యాబ్ రిపోర్ట్ ఏంటి?? ఫిల్మ్‌నగర్ వర్గాలు ఈ సినిమాల గురించి ఏమంటున్నాయి..??
* మనమంతా:
మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన సినిమా ఇది. మూడు వెర్షన్ల కోసం వేర్వేరుగా షూట్ చేశారు. అందుకే బడ్జెట్ కూడా భారీగా అయ్యింది. మూడు చోట్ల సెన్సార్ విడివిడిగా చేశారు. మూడు భాషల్లోనూ ఓన్ రిలీజే. తెలుగు, తమిళంతో పోలిస్తే… మలయాళంలో ఈసినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే అక్కడ మోహన్ లాల్ సూపర్ స్టార్. దాదాపు యేడాదిన్నర తరవాత మోహన్ లాల్ సినిమా విడుదల అవుతోందక్కడ. దాంతో మనమంతాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలున్నాయి.
సినిమా పరంగా చూస్తే… ఫస్టాఫ్ చాలా స్లోగా సాగుతోందట. నాలుగు పాత్రల్ని, నాలుగు కథల్ని పరిచయం చేయడానికి ఫస్టాఫ్ వాడుకొన్నాడు చంద్రశేఖర్ యేలేటి. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్‌కి ముందు ఈ నాలుగు కథల్ని ఓ చోట దర్శకుడు తెలివిగా ఇంటర్‌లింక్ చేశాడట. అక్కడ్నుంచి ఎమోషన్ డ్రామా ఓ రేంజులో పండిందని చెబుతున్నారు. ఆఖరి 30 నిమిషాలూ హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలతో నింపేశారట. ఆ సన్నివేశాలు ఎంత బాగా క్లిక్ అయితే ఈ సినిమా అంత బాగా ఆడుతుందని చిత్రబృందం నమ్ముతోంది. అయితే ఇది పక్కాగా మల్టీప్లెక్స్ సినిమానే. బీ,సీల్లో టికెట్లు తెగే అవకాశమే లేదు. మల్టీప్లెక్స్‌తో పాటు మలయాళంలో ఓ రేంజులో ఆడితే ఈ సినిమా లాభాల బాటెక్కడం ఖాయం.
* శ్రీరస్తు – శుభమస్తు
గౌరవంతో ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో అల్లు శిరీష్. కొత్త జంట ఓకే అనిపించింది. ఆ తరవాత కాస్త విరామం తీసుకొని శ్రీరస్తు – శుభమస్తుతో అలరించడానికి సిద్దమయ్యాడు. యువత, ఆంజనేయులు, సారొస్తారా సినిమాలతో తన స్టాంప్ వేసే ప్రయత్నం చేశాడు పరశురామ్. సారొస్తారా బాగా నిరాశ పరిచింది. అనుకొన్న ప్రాజెక్టులు చేజారిపోయాయి. దాంతో… పరశురామ్‌కి ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కడం అత్యవసరం. దాంతో ఈ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టాడట. దానికి తోడు సినిమా బాగా వచ్చిందన్నది లాబ్ రిపోర్ట్. ఎమోషన్ సీన్లు బాగా పండాయట. దానికి తోడు… పరశురామ్ రాసుకొన్నడైలాగులు ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అని తెలుస్తోంది. ఫస్టాఫ్ సరదాగా సాగిపోయినా.. సెకండాఫ్‌లో అసలు కథ నడుస్తుందట. ఫైనల్‌గా.. హార్ట్ టచింగ్ ఎండింగ్ ప్లాన్ చేశాడట పరశురామ్. ఓవరాల్ గా
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ నుంచి బీ సెంటర్ వరకూ ఈ సినిమా నడవొచ్చని… సీ కి చేరడం పైనే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.