సినీ పరిశ్రమ లో జాతకాలు ప్రతి శుక్రవారం మారిపోతుంటాయి. సక్సెస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ గౌరవం. ఫ్లాపుల్లో ఉన్నవారంటే అందరికీ చేదే. హిట్టిచ్చిన వాళ్ళ వెనకాల చెక్కులు పట్టుకుని పరిగెడతారు. ఒక్క ఫ్లాప్ వచ్చిందా, అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే వారివైపు తొంగిచూడరు. అందుకే దీన్ని “చిత్ర” పరిశ్రమ అంటుంటారు. కానీ గీతా ఆర్ట్స్ మాత్రం, ఫ్లాపులిచ్చిన దర్శకుల గీత మార్చే పని పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
ఆ మధ్య ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు పరశురాం ని పిలిచి మరీ అల్లు శిరీష్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అతను కూడా దాన్ని తన పరిధిలో బాగానే ఉపయోగించుకుని శిరీష్ కి ఒక డీసెంట్ సినిమా తీసి ఇచ్చాడు.
‘బొమ్మరిల్లు’ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించి దక్షీణాది సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన “బొమ్మరిల్లు భాస్కర్” చాలా కాలంగా అవకాశాల్లేక ఖాళీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో ‘ఆరెంజ్’ రూపం లో ఒక భారీ డిజాస్టర్‌ను, రామ్ తో ‘ఒంగోలు గిత్త’ అనే పరాజయాన్ని మూటగట్టుకున్న భాస్కర్ కి నిర్మాతలు కిలోమీటర్ దూరాన్ని పాటించారు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసేందుకు ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయమని కోరినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే “బ్రహ్మోత్సవం” రూపం లో ఒక భారీ డిజాస్టర్‌ను ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ని మంచి స్క్రిప్ట్ తయారు చేయమని గీతా ఆర్ట్స్ కోరినట్టు తెలుస్తోంది.
అయితే ఇలా ఫ్లాపులిచ్చిన దర్శకులని కథలు తయారు చేయమని చెప్పడం లో, వారి చేత హిట్ సినిమాలు తీయించడం లో గీతా ఆర్ట్స్ కి పెద్ద సెటప్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వతహాగా అల్లు అరవింద్ కి మంచి స్టోరీ జడ్జ్ మెంట్ ఉంది. నిజానికి చిరంజీవిని మెగా స్టార్ ని చేయడం ఆయన కథల ఎంపిక పాత్ర ఉందని చెబుతారు. అదీ కాక ఇప్పుడు స్టోరీస్ వినడానికి, వాటికి సూచనలు చెప్పడానికీ, గీతా ఆర్ట్శ్ పెద్ద టీం ని సెపరేట్ గా మెయింటెయిన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో పిలిచి అవకాశమిచ్చినా , గీతా ఆర్ట్స్ ని మెప్పించే కథ చెప్పడం ఈ ఫ్లాప్ దర్శకులకి అంత సులువు కాదు. ఫ్లాప్ దర్శకులే కాదు, సరైనోడు టైం లో బోయపాటి ని కూడా సెకండాఫ్ విషయం లో పలు వెర్షన్లు వ్రాయించి, పలు సూచనలు చేసి, కథని ఒక కొలిక్కి తీసులురావడానికే నెలల తరబడి టైం వెచ్చించారు. అయితే ఇలాంటి కష్టం పడ్డందుకు, తగిన ఫలం కూడా పొందుతున్నారు , హిట్ల రూపం లో.
ఇదండీ గీతా ఆర్ట్స్ పునరావాస కేంద్రం వెంకాల ఉన్న అసలు కథ.