టాలీవుడ్లో రూపొందుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్.ఆర్.ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు కథానాయలుగా రూపొందుతున్న చిత్రమిది. అటు దర్శక ధీరుడు.. ఇటు ఇద్దరు స్టార్ హీరోలు. ఒకరు మెగా ఇంటి నుంచి, మరొకరు నందమూరి వంశం నుంచి వచ్చినవాళ్లు. కనీవినీ ఎరుగని కాంబో ఇది. మరి ఇది ఎలా సెట్టయ్యింది? రాజమౌళి ఇద్దరు హీరోల్ని ఎలా ఒప్పించాడు? ఇన్సైడ్ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తెలుగు 360కి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ఓసారి రామ్‌చరణ్‌ని తన ఆపీసుకు పిలిపించాడట రాజమౌళి. ”నీ కోసం ఓ కథ రెడీ చేస్తున్నా.. ఇందులో ఇంకో హీరో కూడా ఉన్నారు.. అదెవరో తరవాత చెబుతా” అంటూ.. పంపించేశాడట. మరోసారి ఎన్టీఆర్‌కి పిలుపు అందింది. ‘నీ కోసం ఓ కథ రాశా.. ఇందులో ఇంకో హీరో ఉన్నాడు’ అంటూ చరణ్‌కి వేసిన క్యాసెట్టే ఎన్టీఆర్‌కీ వేశాడట రాజమౌళి. ఈసారి ఇద్దరినీ తన ఆఫీసుకు పిలిపించి.. ”నా కథలో మీరిద్దరే హీరోలు” అంటూ కుండబద్దలు కొట్టేశాడట. ఎన్టీఆర్‌ని చూసేంత వరకూ చరణ్‌కీ, చరణ్‌ని చూసేంత వరకూ ఎన్టీఆర్‌కీ మరో హీరో ఎవరన్నది తెలీదట. ఆ క్షణంలో ‘నో’ చెప్పే ఛాన్సే లేదు. కాబట్టి.. ‘ఎస్’ అనేశారు. అప్పుడే తీసిన ఫొటోనే… బయటకు వచ్చింది. ఆ ఫొటో తోనే రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ అనే న్యూస్ బయటకు వచ్చింది.
మొన్నామధ్య ‘ఆర్.ఆర్.ఆర్’ అంటూ ఓ లోగో డిజైన్ చేసి టీజర్ వదిలారు. ఇలా ఓ టీజర్ వస్తుందన్న సంగతి చరణ్, ఎన్టీఆర్ లకు కూడా తెలీదట. ఆఖరికి చిత్ర నిర్మాత డివివి దానయ్యకూ ఈ సంగతి తెలీదట. రాజమౌళి మనసులో రెండు మూడు లైన్లు ఉన్నాయని, అవి చరణ్, ఎన్టీఆర్లకు చూచాయిగా తెలుసని, ఈసారి రాజమౌళి వీరిద్దరినీ పిలిపించి కథ వినిపించబోతున్నాడని సమాచారం. ఇక మీదట రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్‌లు కలసిన ఫొటో బయటకు వస్తే… ఆరోజే కథ ఓకే అయిపోయినట్టు అనుకోవాలి.