త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ – ప్రకటన చిత్రసీమకు షాకిచ్చింది. ఈ కాంబినేషన్ పై ఇప్పటి వరకూ గాసిప్పులు రాయుళ్లకు కూడా ఎలాంటి ఉప్పూ అందలేదు. ఇద్దరు సినిమా వాళ్లు కలిస్తే… వాళ్ల కాంబినేషన్లో సినిమా వచ్చేయడం ఖాయంటూ పుంకాను పుంకాలుగా రాసేవాళ్లు కూడా ఈ కాంబోని, ఇప్పుడు… ఈ పరిస్థితుల్లో ఊహించలేదు. సడన్‌గా వెంకీ – త్రివిక్రమ్‌ల సినిమా అనేసరికి షాక్ తినాల్సివచ్చింది. కాకపోతే.. మహా ఇంట్రస్టింగ్ కాంబినేషన్. నువ్వు నాకు నచ్చావ్లో వెంకీ కామెడీ టైమింగ్ ఓ రేంజులో ఉంటుంది. ఆ సినిమాలో సింగిల్ లైన్లతో ఆడేసుకున్నాడు. మల్లీశ్వరిలోనూ అంతే. ఈ రెండు సినిమాల తరవాత.. ఆ స్థాయిలో వెంకీ నవ్వించలేకోపోయాడన్నది వాస్తవం. అందుకే వెంకీ – త్రివిక్రమ్‌లు మళ్లీ కలిస్తే చూడాలని అభిమానులు ఆశించారు.
అందుకు తగిన ప్రయత్నాలు జరక్కపోలేదు. వెంకీ – త్రివిక్రమ్‌లను కలపాలని సురేష్ బాబు ఎంతగానో ప్రయత్నించాడు. ఓ దశలో కాంబినేషన్ సెట్టయిపోయింది కూడా. కానీ… స్టార్ హీరోలతో సినిమా ధ్యాసలో పడిపోయిన త్రివిక్రమ్ ఎందుకో వెంకీని నిర్లక్ష్యం చేశాడు. ఆ కినుక వెంకీకి కూడా ఉంది. అడిగి ‘నో’ అనిపించుకున్నా అనే ఫీలింగ్ వెంకీని చాలా కాలం వెంటాడింది. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా ఎప్పుడు అని వెంకటేష్‌ని మీడియా మిత్రులు ఎప్పుడు అడిగినా.. తనదైన శైలిలో గాల్లో చేతులు చూపించేవాడు వెంకీ.
అయితే అజ్ఞాతవాసిలో వెంకీ ఎంట్రీ.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. చడీ చప్పుడు లేకుండా వెంకటేష్ ఈ సినిమాలో భాగం పంచుకోవడం షాక్ ఇచ్చింది. అజ్ఞాతవాసిలో ఓ చిన్న పాత్ర చేయడానికి వెంకీ ఒప్పుకున్నాడు. అదంతా పవన్ తో ఉన్న స్నేహం వల్ల అనుకున్నారంతా. కాకపోతే.. దాని వెనుక ‘దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయి’ అనేది ఇప్పుడు తెలిసింది. త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఎలాగూ చేస్తున్నాను కదా.. అని అడిగిన వెంటనే చిన్న పాత్రలో మెరవడానికి వెంకీ ఒప్పుకుని ఉంటాడు. అది వెంకీకి ప్లస్ అయ్యింది. అడిగిన వెంటనే ఒప్పుకున్న వెంకీ రుణాన్ని… సోలో సినిమాతో తీర్చుకోబోతున్నాడు త్రివిక్రమ్. ”యేడాది నుంచీ ఈ కాంబినేషన్ ఊగిసలాడుతోంది. అజ్ఞాత వాసి షూటింగ్‌లోనే వెంకీకి త్రివిక్రమ్ మాట ఇచ్చాడు. దాన్ని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు” అని ‘అజ్ఞాతవాసి’ యూనిట్ లో ఓ కీలకమైన సభ్యుడు చెప్పాడు. అదీ ఈ సడన్ సర్ప్రైజ్ వెనుక ఉన్న కథ. మొత్తానికి వెంకీకి పుట్టిన రోజు నాడు మంచి గిఫ్టే అందింది.